Gen Z Is Suffering From Neck and Back Pain : ఈరోజుల్లో మెడ నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పి వంటి సమస్యలు కేవలం పెద్దవారిలోనే కాదు.. యువతలో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా Gen Zలు గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్‌ల ముందు గడపడం వల్ల ఈ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం, మొబైల్ వాడకంతో సరైన భంగిమలో కూర్చోకపోవడం, వ్యాయామం లేకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలు శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో చిన్న వయసులోనే మెడ, వెన్ను, కాళ్ల నొప్పులతో బాధపడే పరిస్థితి వస్తోంది.
మెడ నొప్పికి కారణం
చాలామంది యువత ఫోన్ చూస్తూ గంటల తరబడి తల వంచి కూర్చుంటున్నారు. అలాగే ల్యాప్‌టాప్ ముందు కూడా సరైన భంగిమ లేకుండా పనిచేస్తుంటారు. సరిగ్గా కూర్చోకుండా ఎక్కువసేపు ఉండటం వల్ల మెడపై ఒత్తిడి పెరిగి నొప్పి మొదలవుతుంది. వీడియో గేమ్స్, సోషల్ మీడియా, టెక్స్టింగ్ వంటి అలవాట్లు కూడా మెడ కండరాలను బలహీనపరుస్తున్నాయి. దీన్ని చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ దీర్ఘకాలంలో ఇది తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వ్యాయామం లేకపోవడం కూడా..
గతంతో పోలిస్తే ఇప్పుడు యువత శారీరకంగా చాలా తక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. బయట ఆటలు, నడక, అవుట్ డోర్ గేమ్స్ ఆడడం వంటివి తగ్గిపోయాయి. చదువు, పని, వినోదం, గేమ్స్ అన్నీ స్క్రీన్‌కే పరిమితం అవుతున్నాయి. అలాగే రోజంతా ఒకేచోట కూర్చోవడం వల్ల కండరాలు బలహీనపడుతున్నాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. దీని ప్రభావం నడుము, కాళ్లపై ఎక్కువగా పడుతుంది.
కాళ్ల నొప్పులకు కారణం
ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో.. ముఖ్యంగా కాళ్లలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో కాళ్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే లుక్స్ కోసం అసౌకర్యంగా ఉండే షూస్ వేసుకోవడం, స్ట్రెచింగ్ చేయకపోవడం, నడక లేకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతున్నాయి. కొందరిలో విటమిన్ D, కాల్షియం లోపం వల్ల కూడా కాళ్ల బలహీనత, నొప్పులు కనిపించొచ్చు.
ఒత్తిడి, నిద్రలేమి ఎఫెక్ట్
చదువులో ఒత్తిడి, కెరీర్ టెన్షన్, సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం వంటి కారణాల వల్ల చాలామంది యువత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి కండరాల బిగుతుకు కారణమవుతుంది. ముఖ్యంగా మెడ, భుజాల దగ్గర నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రాత్రిళ్లు ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల నిద్ర కూడా సరిగా ఉండదు. సరైన విశ్రాంతి లేకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది.
నొప్పులు ఎలా దూరం చేసుకోవాలి?
మీలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. మొబైల్, ల్యాప్‌టాప్ వాడేటప్పుడు సరైన భంగిమలో కూర్చోవాలి. ప్రతి గంటకోసారి లేచి కొద్దిసేపు నడవాలి. అలాగే రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. యోగా, స్ట్రెచింగ్ అలవాటు చేసుకుంటే మంచిది. రాత్రుళ్లు ఫోన్ మానేస్తే మంచిది. వాడినా తక్కువగా వాడితే బెటర్, అలాగే నిద్ర విషయంలో రాజీ పడకూడదు.
టెక్నాలజీ జీవితాన్ని సులభం చేసింది. కానీ అదే టెక్నాలజీని అతిగా వాడటం వల్ల యువత ఆరోగ్యం దెబ్బతింటోందని నిపుణులు చెప్తోన్నారు. కాబట్టి చిన్న వయసులోనే వచ్చే ఈ నొప్పులను నిర్లక్ష్యం చేయకండి. లేదంటే భవిష్యత్తులో అవే పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
