Vitamin D Deficiency vs Overdose : ఈ మధ్యకాలంలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే శరీరంలో విటమిన్ డి లోపిస్తే.. ఎముకల్లో బలం తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ తగ్గి, నీరసంగా ఉంటారు. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యను దూరం చేసుకోవడానికి వైద్యులు విటమిన్ డి సప్లిమెంట్స్ సూచిస్తున్నారు. కానీ మీకు తెలుసా? విటమిన్ డి ఎక్కువగా తీసుకున్నా కూడా ప్రమాదమే అంటున్నారు వైద్యులు.
విటమిన్ డి..
విటమిన్ డి అనేది విటమిన్ సి లాంటి వాటిలా కాదు. ఇది ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్. అంటే ఇది శరీరంలో నిల్వవుతుంది. అందుకే అవసరానికి మించి తీసుకుంటే.. అది బయటకు వెళ్లకుండా శరీరంలోనే పేరుకుపోయి ప్రమాదకర స్థాయికి చేరుతుంది. సాధారణంగా ఆహారం లేదా సూర్యరశ్మి ద్వారా వచ్చే విటమిన్ D వల్ల సమస్య ఉండదు. కానీ సప్లిమెంట్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్లే ఓవర్‌డోస్ సమస్య వస్తుందని వైద్యులు చెప్తున్నారు.
చాలామంది విటమిన్ డి లోపం ఉందని.. వైద్యులు సూచించినా.. సూచించకున్నా.. సప్లిమెంట్స్ తీసేసుకుంటారు. అలా తీసుకుంటే ఓవర్‌డోస్ అయ్యే ప్రమాదం ఉంది. అలా విటమిన్ డి శరీరంలో ఎక్కువ పేరుకుంటే వచ్చే నష్టాలు ఏంటో చూసేద్దాం.
విటమిన్ డి ఎక్కువైతే..
విటమిన్ D ఎక్కువైతే రక్తంలో కాల్షియం స్థాయి అధికమవుతుంది. దీనిని హైపర్‌కాల్సీమియా అంటారు. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. ఎముకలు కూడా బలహీనపడి.. శరీర అవయవాలకు నష్టం కలిగిస్తాయి.
ఓవర్‌డోస్ అయితే కలిగే లక్షణాలు ఇవే..
విటమిన్ డి ఓవర్ డోస్ అయితే కొన్ని లక్షణాలను శరీరం ఇస్తుంది. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాంతులు, వికారంగా అనిపించడం, ఆకలి తగ్గడం, దాహం ఎక్కువగా వేయడం, తరచుగా మూత్రం పోవడం, అలసట, కండరాల బలహీనత, బరువు తగ్గడం, కన్ఫ్యూజన్, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన స్థితిలో కిడ్నీ డ్యామేజ్ కూడా జరుగుతుంది.
విటమిన్ D లోపం వల్ల వచ్చే సమస్యలు
విటమిన్ D తగ్గినా కూడా సమస్యలే వస్తాయి. ఎముకలు బలహీనపడటం, కీళ్ల నొప్పులు, అలసట, ఇమ్యూనిటీ తగ్గడం, పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో ఆస్టియోపొరోసిస్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
విటమిన్ డి లోపం ఉంటే..
విటమిన్ డి లోపం ఉంటే.. రోజూ 15 నుంచి 20 నిమిషాలు ఎండలో ఉండాలి. అలాగే వైద్యుల సలహా లేకుండా సప్లిమెంట్స్ తీసుకోకూడదు. బ్లడ్ టెస్ట్ చేయించుకుని.. అవసరమైతేనే డోస్ తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. అలాగే విటమిన్ డి సహజంగా లభించే ఆహారాలు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసొన, చేపలు, పాలు, మష్రూమ్స్ వంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది.
విటమిన్ D శరీరానికి చాలా అవసరం. అలా అని ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. మొత్తానికి తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వైద్యుల సలహాతో సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
