Hidden Causes of Weight Gain : బరువు పెరుగుతున్నామనో.. లేదా ఇతర కారణాల వల్ల కొందరు ఆహారం చాలా తక్కువగా తీసుకుంటారు. అయినా సరే బరువు పెరుగుతూనే ఉంటారు. ఫుడ్ తక్కువగా తీసుకున్న బరువు ఎందుకు పెరుగుతారు? ఏమైనా ఆరోగ్య సమస్యలు కారణామా? తక్కువ తిన్నా సరే బరువు పెరగడానికి కారణాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అకస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా?

చాలామంది బరువు పెరగడానికి ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడమే కారణం అనుకుంటారు. అయితే హార్వర్డ్ హెల్త్ (2023) ప్రకారం.. తెలియకుండా బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. వయస్సు పెరిగికొద్ది.. శారీరకంగా జరిగే మార్పులు, అంతర్లీన వ్యాధులు, వివిధ మందుల దుష్ప్రభావం, గట్ బ్యాక్టీరియా కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చని తెలిపింది. 

ఈ విషయంపై ఢిల్లీలోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ సంజయ్ గుప్తా.. బరువు పెరగడం కేవలం కేలరీలపై ఆధారపడి ఉండదని తెలిపారు. హార్మోన్ల అసమతుల్యత, నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల శరీర జీవక్రియ ప్రభావితమవుతుందని వెల్లడించారు. వీటివల్ల కూడా బరువు పెరగవచ్చు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలే కారణమవ్వొచ్చు. అవేంటంటే..

హైపోథైరాయిడిజం (Hypothyroidism)

థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం వస్తుంది. ఈ పరిస్థితి జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. దీనివల్ల అలసట, బలహీనత వస్తుంది. అలాగే అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, చలిని తట్టుకోలేకపోవడం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. 

ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో థైరాయిడ్ నిపుణులైన డాక్టర్ రీటా శర్మ మాట్లాడుతూ.. ''హైపోథైరాయిడిజంను సకాలంలో పరీక్షించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీతో బరువును నియంత్రించవచ్చు. కానీ వైద్యుని సలహా లేకుండా మందులు తీసుకోకూడదు.'' అని వెల్లడించారు.

పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)

PCOS అనేది హార్మోన్ల రుగ్మత. ఇది మహిళల అండాశయాలలో అధిక మొత్తంలో పురుష హార్మోన్ (ఆండ్రోజెన్) ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుంది. PCOS ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. దీనివల్ల బరువు పెరిగే అవకాశం పెరుగుతుంది.

కుషింగ్ సిండ్రోమ్ (Cushing’s Syndrome)

శరీరంలో కార్టిసాల్ హార్మోన్ (ఒత్తిడి హార్మోన్) స్థాయి అసాధారణంగా పెరిగినప్పుడు కుషింగ్ సిండ్రోమ్ వస్తుంది. ఈ పరిస్థితి స్టెరాయిడ్ మందులను ఎక్కువ కాలం వాడటం లేదా అడ్రినల్ గ్రంథిలో కణితులు ఏర్పడటం వల్ల సంభవించవచ్చు.

డిప్రెషన్(Depression and Anxiety)

మానసిక ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్, ఆందోళన వంటివి.. ఆకలి, ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతాయి. డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా 'కంఫర్ట్ ఫుడ్స్' వైపు ఆకర్షితులవుతారు. ఇవి అధిక కేలరీలతో నిండి తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగిపోతారు.

నిద్ర (Sleep Deprivation and Stress)

నిద్ర లేకపోవడం, ఒత్తిడి కారణంగా కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ఆకలి పెరుగుతుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. రాత్రినిద్ర 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బరువు పెరిగేలా చేస్తాయి. 

కాబట్టి మీరు తక్కువగా తిన్నా కూడా బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తే.. వెంటనే మెడికల్ టెస్ట్​లు చేయించుకోండి. మీ రిపోర్ట్స్ బట్టి వైద్యులే మీకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. అలాగే వైద్య సమస్యలు ఉంటే.. దానికి తగ్గ మెడిసన్స్ ఉపయోగిస్తూ బరువును అదుపులోకి తెచ్చుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.