Gond Katira Benefits for Skin : యవ్వనంగా కనిపించేందుకు.. వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకునేందుకు ఖరీదైన సీరమ్‌లు, కెమికల్స్​తో నిండిన క్రీమ్‌లు ఉపయోగిస్తున్నారా? అయితే వాటికి ఇక చెక్ పెట్టేయండి. అతి తక్కువ ఖర్చుతోనే.. ఎలాంటి కెమికల్స్ లేకుండా.. సహజంగా వృద్ధాప్యఛాయలను దూరం చేసే.. గోండ్ కటీరా ఉండగా.. ఇవన్నీ దండగా. శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి దీనిని చాలామంది తీసుకుంటారు. అయితే ఇది చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తుందట. యవ్వనంగా కనిపించేందుకు దీనిని ఎలా తీసుకోవాలో.. దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

గోండ్ కటీరా అంటే ఏమిటి?

గోండ్ కటీరా. దీనిని బాదం జిగురు అని కూడా పిలుస్తారు. సహజమైన మొక్కల ఆధారిత జిగురు ఇది. చూసేందుకు జెల్లీ లాగా ఉంటుంది. దీని గురించి ఆయుర్వేదంలో కూడా ప్రస్తావన ఉంది. దీనికి ఎలాంటి రుచి, వాసన ఉండదు. దాని శక్తివంతమైన శీతలీకరణ, శోథ నిరోధక, స్కిన్-బూస్టింగ్ లక్షణాలకు ఇది ప్రసిద్ధి చెందింది. హైడ్రేటింగ్ లక్షణాలు కలిగిన ఈ గోండ్ కటీరా వృద్ధాప్య ఛాయలను దూరం చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి.. చర్మం బిగుతుగా మారేలా చేస్తుంది. యవ్వనమైన, మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందడానికి దీన్ని తీసుకోవచ్చు.

చర్మానికి గోండ్ కటీరా వల్ల కలిగే లాభాలివే

  • కొల్లాజెన్ : గోండ్ కటీరాలో ఉండే కార్బోహైడ్రేట్స్ వంటి పాలీశాకరైడ్‌లు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫైన్ లైన్స్ తగ్గించి.. ముడతలను తగ్గిస్తుంది.  
  • హైడ్రేషన్: గోండ్ కటీరాను నానబెట్టినప్పుడు జెల్లీలాగా మారుతుంది. ఇది లోపలి నుంచి చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. స్కిన్ పొడిబారడం, పొలుసులుగా మారడం, చర్మాన్ని మృదువుగా చేయడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.
  • చర్మాన్ని బిగుతుగా చేసే ఏజెంట్: గోండ్ కటీరాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అకాల వృద్ధాప్య గుర్తులు తగ్గుతాయి. ఎలాంటి క్రీమ్​లు ఉపయోగించకుండా యవ్వనమైన రూపాన్ని అందిస్తుంది.
  • మొటిమలకై: గోండ్ కటీరా శీతలీకరణ అందించి శోథ నిరోధక లక్షణాలతో చర్మానికి మేలు చేస్తుంది. మొటిమలు తగ్గించి.. మెరిసే చర్మాన్ని అందించడంలో హెల్ప్ చేస్తుంది. 

గోండ్ కటీరాను ఎలా తీసుకోవాలంటే.. 

కావలసిన పదార్థాలు

  • 1 tsp గోండో కటీరా
  • 1 కప్పు నీరు (రాత్రి నానబెట్టడానికి)
  • 1 కప్పు చల్లని పాలు లేదా రోజ్ వాటర్
  • తేనె లేదా బెల్లం (ఐచ్ఛికం)
ఎలా ఉపయోగించాలంటే.. 
  • 1 tsp గోండో కటీరాను రాత్రిపూట నీటిలో నానబెట్టండి.
  • ఉదయం చల్లని పాలు లేదా రోజ్ వాటర్ కలపండి.
  •  తేనె లేదా బెల్లంకూడా వేసుకోవచ్చు.
  • వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవడానికి ఖాళీ కడుపుతో తాగండి.
దీనిని రోజూ తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు అందుతుంది. 2–3 వారాలలో ఫలితాలు కనిపిస్తాయి. వారానికి 3–4 సార్లు తీసుకోవచ్చు. అదనపు రుచి, ప్రయోజనాల కోసం దానిలో చియా గింజలు, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.

ఫేస్ మాస్క్‌గా..

స్కిన్​ ప్రయోజనాల కోసం గోండో కటీరాను సహజ DIY ఫేస్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.
 
రెసిపీ:
  • 1 tbsp నానబెట్టిన గోండో కటీరా
  • 1 tsp రోజ్ వాటర్
  • కొన్ని చుక్కల కలబంద జెల్
అన్ని పదార్థాలను కలపి ముఖానికి అప్లై చేయాలి. సుమారు 15-20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇది తక్షణమే హైడ్రేషన్ అందిస్తుంది. రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. చర్మం నిర్జీవంగా మారకుండా చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గోండ్ కటీరాను గర్భిణులు వైద్యుల సలహా లేకుండా తీసుకోకూడదు. లో బీపీ ఉండేవారు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది రక్తపోటు స్థాయిలను మరింత తగ్గిస్తుంది. అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం లేదా లూజ్ మోషన్స్ అయ్యే అవకాశముంది. రోజువారీ తీసుకోవాలనుకుంటే మితంగా తీసుకోవచ్చు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.