World Biryani Day : ప్రపంచ బిర్యానీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 6వే తేదీన జరుపుకుంటున్నారు. ప్రపంచమంతా పక్కన పెడితే.. తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీకి ఉండే క్రేజ్ వేరు. హైదరాబాద్ బిర్యానీని ఇష్టపడని వారు ఉండరు. అయితే ఈ బిర్యానీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుందని.. పలు సమస్యలకు కారణమవుతుందని అనుకుంటారు. కానీ బిర్యానీని చేసుకునేవిధంగా చేసుకుంటూ.. తీసుకునే విధంగా తింటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు నిపుణులు. 

Continues below advertisement


బిర్యానీని తీసుకునేవిధంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని.. కానీ దానిని సరైన విధానంలో తీసుకోకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని తెలిపారు ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి. అసలు బిర్యానీ తీసుకునేప్పుడు చేయకూడని తప్పులు ఏంటో.. బిర్యానీని ఎలా చేసుకోవాలో.. ఎలా తింటే మంచిదో అనే అంశాలపై ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. అవేంటంటే.. 


''బిర్యానీ చాలా మంచి ఫుడ్. బిర్యానీ పోషకాహారంగా చూస్తే.. దానిలో అన్నం, ప్రోటీన్​కి మాంసం, కూరగాయలు ఇవన్నీ కలిపి బ్యాలెన్స్​ ఫుడ్​గా చెప్పొచ్చు. ఎందుకంటే దానిలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది. వాటితో పాటు వివిధ విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి బిర్యానీని ఎలాంటి సైడ్ డిష్​లు లేకుండా తినాల్సి ఉంటుంది. లేదంటే హెవీ అయిపోతుంది. 


బిర్యానీని ఎలా తినకూడదంటే.. 


బిర్యానీ రీజనల్ రెసిపీని మార్చి.. మసాలాలు, నూనెలు ఎక్కువగా వేసి దానిలోని పోషకాలు కిల్ చేస్తున్నారు. అసలు బిర్యానీని రెండు, మూడు కప్​ కొలతలతో తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఓ ప్లేట్​ నిండా పెట్టుకుని తినేస్తున్నారు. దానితో పాటు సాలన్, పెరుగు వంటి ఇతర ఫుడ్స్ తీసుకుంటారు. అలాగే కొందరు బిర్యానీతో థమ్స్​ అప్ తీసుకుంటారు. కొందరు దీనిని తిన్న తర్వాత స్వీట్​ కూడా తింటారు. ఇలా తీసుకోవడం వల్ల కేలరీ కౌంట్ పెరిగిపోతుంది.'' అని తెలిపారు. 


బిర్యానీని ఇలా తీసుకోవడం వల్ల మనిషి ఓ రోజులో తీసుకోవాల్సిన కేలరీలు కంటే ఎక్కువ ఫుడ్ తీసేసుకుంటున్నాడని.. దాని వల్ల ఇబ్బందులు వస్తున్నాయే తప్పా.. బిర్యానీ వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుందని డాక్టర్ తెలిపారు. ఎక్కువ మోతాదులో బిర్యానీ తినడం, దానితో పాటు ఇతర పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావడంతో పాటు బరువు పెరుగుతారట. తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు.  


బిర్యానీతి స్వీట్స్ తినడం, థమ్స్ అప్ తాగడం చేస్తే ఒబెసిటీ, డయాబెటిస్, బరువు పెరగడం, బీపీ సమస్యలు, జీర్ణ సమస్యలు ఇలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అలాగే బిర్యానీ చేసుకునేప్పుడు నూనె వీలైనంత తక్కువగా ఉపయోగిస్తే మంచిదని కూడా సూచించారు. అలాగే తక్కువ మోతాదులో తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ బిర్యానీని ఎంజాయ్ చేసేయండి. 





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.