Health Tests Every Woman Should Take After 20 : ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాట ఈ రోజుల్లో కరెక్ట్​గా సరిపోతుంది. ఎందుకంటే ఆరోగ్యానికి మించినది ఏమీ లేదు. అది మగవారికైనా, ఆడవారికైనా. అందుకే ప్రతి వ్యక్తి.. ప్రతి వయస్సులోనూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇప్పుడు యంగ్​గా ఉన్నాము.. లేట్ వయసులో చూసుకుందామనుకుంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం పట్ల అంతగా శ్రద్ధ వహించరు. 20ల్లో ఉన్నప్పుడే ఆరోగ్యం పట్ల అవగాహనతో ఉంటే.. వయసు పెరిగే కొద్ది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని చెప్తున్నారు. 

Continues below advertisement

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. దీని కారణంగా కొన్నిసార్లు వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. మరి ఏ పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి? ముందుగా టెస్ట్​లు చేయించుకోవడం, వాటిని గుర్తించడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

HPV టెస్ట్

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మహిళలు 21 ఏళ్ల నుంచే పాప్ టెస్ట్ చేయించుకోవడం ప్రారంభించాలని సూచిస్తున్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా ఈ పరీక్ష చేయించుకుంటే మంచిది. అలాగే పాప్ టెస్ట్‌తో పాటు.. 30 ఏళ్ల నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి HPV పరీక్ష కూడా చేయించుకోవాలి. ఈ టెస్ట్ గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్‌ను గుర్తించడానికి హెల్ప్ చేస్తుంది. ముందుగా దీనిని గుర్తించడం వల్ల సకాలంలో ట్రీట్​మెంట్ అందించవచ్చు.

Continues below advertisement

STD టెస్ట్​లు

చాలామందిలో STDలు.. అంటే లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎటువంటి లక్షణాలు లేకుండానే వస్తాయి. వాటిని గుర్తించడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది మీ భాగస్వామి నుంచి మీకు సంక్రమించే అవకాశం ఉంది. ఎక్కువమంది పార్టనర్స్ ఉంటే.. ప్రమాదం కూడా ఎక్కువ అవుతుంది. దీనివల్ల గర్భధారణ సమయంలో బిడ్డకు హాని కలగవచ్చు. అటువంటి పరిస్థితిలో ఈ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

మధుమేహం 

ఈ మధ్యకాలంలో.. చిన్నవయసులో ఉన్నవారికి కూడా షుగర్ అటాక్ అవుతుంది. యువతలో మధుమేహం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళలకు కూడా ఈ ప్రమాదం ఉండవచ్చు. అందుకే 20 ఏళ్ల తర్వాత క్రమం తప్పకుండా డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.

రొమ్ము ఆరోగ్యానికై

20 ఏళ్ల తర్వాత ప్రతి మహిళ రొమ్ము పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ప్రమాదం చాలా ఉంది. కాబట్టి సరైన సమయ వ్యవధిలో టెస్ట్ చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి.

ఈ తరహా టెస్ట్​లు చేయించుకోవడంతో పాటు.. హెల్తీ పుడ్ తీసుకునేందుకు ట్రై చేయాలి. అలాగే తేలికపాటి వ్యాయామం ముందు నుంచే ప్రారంభిస్తే మంచిది. లేదంటే వాకింగ్ చేయడం, ఇంట్లో పనులతో ఎల్లప్పుడు యాక్టివ్​గా ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ వయసు పెరిగేకొద్ది ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.