Refrigerator Organization : ఫ్రిడ్జ్​​ని కూరగాయలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను తాజాగా, పాడవకుండా ఉండేందుకు వినియోగిస్తారు. దాదాపు అందరిళ్లల్లోనూ ఫ్రిడ్జ్​ ఉంటుంది. అయితే దీనిని మెయింటైన్ చేయడమే అందరికీ రాదు. తెలియకుండా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల కూరగాయలు, పండ్లు త్వరగా పాడైపోతూ ఉంటాయి. పండ్లు, కూరగాయలు పాడవకుండా.. ఎక్కువకాలం వాటిని తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఎలాంటి టిప్స్ కూరగాయలు, పండ్లను ఫ్రెష్​గా ఉంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


కవర్స్​లో పెడుతున్నారా?


ఫ్రిడ్జ్​లో కూరగాయలు, పండ్లను నిల్వ చేసేప్పుడు చాలామంది చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే.. ప్లాస్టిక్ కవర్స్​లో పెట్టడం. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. దానికి బదులు కూరగాయలు, పండ్లను విడివిడిగా కాటన్ బ్యాగ్​లో పెట్టుకోవాలి. లేదంటే సన్నని కాటన్ క్లాత్​లో వాటిని చుట్టి విడిగా స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే కాటన్ తేమను గ్రహించి.. పండ్లు, కూరగాయలను ఎక్కువకాలం తాజాగా ఉండేలా చేస్తుంది. 


ఆకుకూరలను ఇలా పెట్టండి


పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర వంటివి త్వరగా కుళ్లిపోతాయి. లేదంటే ఎండిపోతాయి. కానీ వాటిని కాటన్ బ్యాగ్స్​లో ఉంచితే ఎక్కువకాలం ఫ్రెష్​గా ఉంటాయి. వాటి వాసన కూడా పోదు. అల్లంపై ఉండే మట్టిని శుభ్రంగా కడిగి.. వాటిని ఆరబెట్టి ఫ్రిజ్​లో పెట్టుకోవాలి. అలాగే కొబ్బరికాయను కూడా ఫ్రిడ్జ్​లో నేరుగా పెట్టకూడదు. అలా చేస్తే త్వరగా పాడైపోతుంది కాబట్టి.. కొబ్బరిని తురుముగా చేసుకుని.. దానిని ఓ కంటైనర్​లో పెట్టుకోవాలి. దీనివల్ల బూజు పట్టదు. వంటల్లో వాడుకునేందుకు కూడా ఈజీగా ఉంటుంది. 


పండ్లను ఇలా స్టోర్ చేయండి..


పండ్లను ఉంచేప్పుడు వెంటిలేషన్ కోసం.. రంధ్రాలు ఉన్న కంటైనర్​లో ఉపయోగించవచ్చు. మల్లెపువ్వు, జామపండ్లు వంటి వాటిని ఫ్రిడ్జ్​లో పెట్టేప్పుడు నేరుగా కాకుండా కవర్ చేసి పెట్టుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్​లోని ఆహారపదార్థాలన్నీ వాటి వాసనతో నిండిపోతాయి. నిమ్మకాయను కట్ చేసి ఫ్రిడ్జ్​లో ఓ మూల ఉంచితే ఫ్రిజ్ మంచి వాసన వస్తుంది. 


మూతలేకుండా వద్దు..


పన్నీర్, బటర్ వంటి పాల ఉత్పత్తులను నేరుగా ఫ్రిజ్​లో పెట్టకూడదు. వాటిని అల్యూమినియం ఫాయిల్​తో కవర్ చేసి స్టోర్ చేసుకోవాలి. ఇడ్లీ, దోశ పిండిని మూతలేకుండా ఫ్రిజ్​లో ఉంచకూడదు. గాలిచేరని కంటైనర్​లో వేసి.. ఫ్రిజ్​లో పెట్టుకోవాలి. దీనివల్ల పిండి పాడవదు. అలాగే దానివల్ల ఫ్రిడ్జ్​లో దుర్వాసన రాదు. కూరలు, రైస్ ఇలా ఏ పదార్థాన్ని పెట్టినా.. దానిని మూతలేకుండా, కవర్ చేయకుండా పెట్టకూడదు. అలాగే వాటిని తర్వాతే వాడేసుకోవాలి. ఎక్కువకాలం ఫ్రిడ్జ్​లో ఉంచి.. వాటిని ఉపయోగించడం మంచిది కాదు. 


వాటిని ఫ్రిజ్​లో పెట్టకూడదు.. 


వెండి వస్తువులను ఫ్రిడ్జ్​లో పెట్టకూడదు. ప్లాస్టిక్ కంటైనర్స్​ కూడా వినియోగించకపోవడమే మంచిది. ఫ్రిడ్జ్​​ ఖాళీగా ఉందని.. కొందరు అవసరం లేని వాటిని కూడా ఫ్రిడ్జ్​లో పెట్టేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. ఫ్రిడ్జ్​ ఎప్పుడూ మంచి స్పేస్​తో వెంటిలేషన్ వెళ్లేలా ఉంటే అది ఎక్కువకాలం పని చేసే అవకాశం ఎక్కువ. 


తీసుకోవాల్సిన జాగ్రతలు


వారానికోసారైనా ఫ్రిడ్జ్​​ని శుభ్రం చేయాలి. అప్పుడే అది మంచి కండీషన్​లో వర్క్ చేస్తుంది. అలాగే ఫ్రిడ్జ్​లో పెట్టిన అనవసరమైన, ఎక్కువకాలం ఉంచిన వస్తువులను పడేయడమే మంచిది. ఫ్రిడ్జ్​ వెనుక భాగంలో ఉన్న కంటైనర్​లోని నీటిని తీసేసి శుభ్రం చేస్తే మంచిది. లేకుంటే దోమలు ఎక్కువకావడం, నీటి నుంచి దుర్వాసన రావడం జరుగుతుంది. 



ఐస్ గడ్డకట్టేస్తే..


ఫ్రిడ్జ్​​ని కొందరు ఏ సీజన్​ అయినా ఒకేలాగా వినియోగిస్తారు. సీజన్స్ బట్టి ఫ్రిడ్జ్​ టెంపరేచర్స్​ని మారుస్తూ ఉండాలి. లేదంటే డీప్ ఫ్రీజర్​లో ఐస్ గడ్డకట్టేస్తుంది. దానిని ఎలా తీయాలో తెలియక గంటల కొద్ది ఫ్రిజ్​ని ఆపేస్తారు. లేదా బలవంతంగా ఐస్​ని పగలగొట్టేందుకు ప్రయత్నిస్తారు. దానివల్ల ఫ్రీజర్ పగిలే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటప్పుడు ఫ్రీజర్​లో ఐస్ ఎక్కువగా పేరుకుపోతే.. ఫ్రిడ్జ్​​ మధ్యలో ఉన్న బటన్ నొక్కాలి. ఇది మంచు పేరుకుపోకుండా, గడ్డకట్టకుండా హెల్ప్ చేస్తుంది. 



Also Read : వయసు ప్రకారం బీపీ ఎంత ఉండాలో తెలుసా? మగ, ఆడవారిలో ఉండే వ్యత్యాసం ఇదే