చెవి నొప్పి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. చెవిలో గుబిలి (గులిమి) ఎక్కువగా ఉన్న, ఇన్ఫెక్షన్స్ సోకినా లేదంటే దంతాలు పుచ్చినప్పుడు ఆ నొప్పి చెవికి కూడా సోకుతుంది. దాని వల్ల రోజంతా ఏ పనులు చేయలేరు. ఇన్ఫెక్షన్స్ ఉంటే చల్లని వాతావరణంలో నొప్పి మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ సీజన్ లో చెవి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ చిట్కాలు పాటించి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ డింపుల్ జంగ్ద.


కర్ణ పురాణం( చెవిలో నూనె రాయడం): వివిధ చెవి వ్యాధులని నయం చేయడానికి చెవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సురక్షితమైన మార్గం అని ఆమె చెప్పుకొచ్చారు. వివిధ పదార్థాలతో చేసిన నూనె చెవిలో వేసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. అందులో మొదటిది.


బాసిల్: చూసేందుకు కాస్త పుదీనాని పోలి ఉంటుంది. బాసిల్ మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలతో నిండి ఉంది. ఇది చెవి నొప్పి, ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ మొక్క ఆకులు కొన్నింటిని తీసుకుని మెత్తగా రుబ్బి దాని నుంచి వచ్చిన రసాన్ని చెవిలో ఒకటి లేదా రెండు చుక్కలు వేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.


లవంగాల నూనె: ఈ నూనెలో అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఒక టీ స్పూన్ నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని వేయించి కాసేపు మరిగించాలి. కొద్దిగా చల్లారిన తర్వాత నూనె ఫిల్టర్ చేసి చెవిలో ఒకటి లేదా రెండు చుక్క గోరువెచ్చని నూనె వేసుకోవాలి.


నువ్వులు లేదా ఆలివ్ నూనె: అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెవి నొప్పికి సమర్థవంతమైన ఇంటి చిట్కాగా ఆలివ్ నూనెని సిఫార్సు చేస్తున్నారు. ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె వేడి చేసి చల్లారిన తర్వాత చెవిలో 1 లేదా 2 చుక్కలు వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది.


టీ ట్రీ ఆయిల్: ఇది శక్తివంతమైన యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలని కలిగి ఉంది. చెవి నొప్పికి తగ్గించే అద్భుతమైన నూనె. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె వంటి ఏదైనా ఆయిల్ ని ఒక టీ స్పూన్ టీ ట్రీ ఆయిల్ లో ఒకటి లేదా రెండు చుక్కలు కలుపుకోవాలి. దాన్ని నొప్పిగా ఉన్న చెవిలో వేసుకోవాలి.


ఇవే కాదు అల్లం లేదా వెల్లుల్లి కూడా చెవి నొప్పి నుంచి బయటపడేస్తాయి. కొన్ని వెల్లుల్లి ముక్కలని నమలడం వల్ల నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.


అల్లం: ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చెవి ఇన్ఫెక్షన్లతో పొరాడటానికి, నొప్పిని తగ్గించేందుకు సహాయపడతాయి. పచ్చి తాజా అల్లం ముక్కని మెత్తగా నూరి అందులోని రసాన్ని తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చెవి నొప్పి ఉన్న చర్మం మీద రాసుకోవాలి. అల్లం రసం, అల్లం నూనె రెండింటినీ ఉపయోగించవచ్చు. చెవి చుట్టూఉన్న చర్మంపై ఏదైనా వస్త్రం లేదా కాటన్ తో అప్లై చేసుకోవచ్చు.


వెల్లుల్లి: చెవి మంట, నొప్పిని తగ్గిస్తుంది. మూడు వెల్లుల్లి రెబ్బలని గోరువెచ్చగా వేయించి చిటికెడు ఉప్పుతో కలిపి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక వస్త్రంలోకి తీసుకుని చెవిపై మర్దన చేస్తే నొప్పి తగగుస్తుంది.


⦿ యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పీల్చుకోవచ్చు. ఇది చెవి, సైనస్ భాగాలని క్లియర్ చేస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఇలా చేశారంటే మీ పాదాలు మృదువుగా మారిపోతాయ్, ఇన్ఫెక్షన్లు దరిచేరవు