రీరంలోని ఇతర భాగాల మాదిరిగానే పాదాలకి కూడా సబ్బు రాసి రుద్దుకుంటారు. అంతటితో అయిపోతుందిలే అని అనుకుంటారు. ప్రతిరోజు పాదాలు శుభ్రం చేస్తున్నప్పటికి అవి ఎందుకు వాసన వస్తాయ్? ఎందుకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురవుతాయో తెలుసా? వాటిని కేవలం సబ్బుతో కడిగినంత మాత్రాన సరిపోదు. ఇతర జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పాదాలని క్రమం తప్పకుండా కడగటం, ఎక్స్ ఫోలియేట్ చేయాలని, అలా చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


బయట తిరిగి రావడం వల్ల పాదాలు బ్యాక్టీరియాతో కప్పబడి ఉంటాయి. అవి చర్మంలోని మిగిలిన భాగాలకి కూడా వ్యాపిస్తాయి. అందుకే వాటిని కేవలం సబ్బు నీటితో కడగటం వల్ల ఉండే ప్రయోజనాలు చాలా తక్కువ. అందులోని రసాయన అవశేషాలు ఒక్కోసారి పాదాల చర్మానికి మరింత హాని కలిగించి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి దారితీసే అవకాశం ఉంది. అందుకే పాదాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


మృదువైన పాదాల కోసం వెనిగర్


ఇన్ఫెక్షన్, చెడు వాసన, పాదాలు గట్టిగా అయిపోవడాన్ని నివారించేందుకు సహాయపడే అద్భుతమైన పదార్థం వెనిగర్. ఇది బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్ళలో పాదాలు నానబెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ‘మెడికల్ న్యూస్ టుడే’ ప్రకారం ఒక టబ్ లో ఒక భాగం వెనిగర్ వేసి రెండు భాగాలు నీళ్ళు వేసి వాటిలో పాదాలు 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. పాదాల సమస్యలు నయం అయ్యేవరకి ఈ విధానాన్ని పునరావృతం చేయొచ్చు. హెర్బల్ లేదా ప్రూట్ వెనిగర్ లో అదనపు పదార్థాలు ఉన్నందున వాటిని నివారించడం మంచిది.


వెనిగర్ వల్ల ప్రయోజనాలు


వాతావరణ పరిస్థితుల వల్ల బ్యాక్టీరియా పెరిగి పాదాలు ఇన్ఫెక్షన్స్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చర్మ నిపుణులు అంటున్నారు. వెనిగర్ లోని గుణాలు పాదాలకి మృదుత్వాన్ని ఇస్తుంది.


చెడు వాసన పోగొడుతుంది


చెమట కారణంగా పాదాలు చెడు వాసన వస్తాయి. వ్యాయామం లేదా ఇతర శ్రమతో కూడిన కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు పాదాలకి చెమటలు పడతాయి. వెనిగర్ నీళ్ళలో పెట్టడం వల్ల చెమట వల్ల వచ్చే దుర్వాసన పోగొడుతుంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పాదాల దుర్వాసనకి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపేందుకు సహాయపడుతుంది. పాదాలు నానబెట్టే ముందు, తర్వాత వాటిని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.


అథ్లెట్ ఫూట్ 


అథ్లెట్ ఫూట్ శిలీంధ్రాల వల్ల కలిగే అంటు వ్యాధి ఇది. బూట్లు ధరించడం వల్ల తరచుగా శిలీంధ్రాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది తరచుగా కాలి వేళ్ళ మధ్య అభివృద్ధి చెందుతుంది. చర్మం పొడిగా మారి దెబ్బతినేందుకు కారణమవుతుంది. జిమ్ లేదా స్విమ్మింగ్ పూల్ వంటి బహిరంగ ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడిచే వాళ్ళు ఎక్కువగా అథ్లెట్ ఫూట్ బారిన పడతారు. ప్రతిరోజు పాదాలని వెనిగర్ లో నానబెట్టడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తో పోరాడవచ్చు.


పులిపిర్లు


మొటిమలు అనేది హ్యూమన్ పాపిల్లోమావైరస్ లేదా HPV నుండి వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడతాయి. మొటిమలు లేదా పులిపిర్లు పాదాల మీద వచ్చి ఇబ్బంది పెడతాయి. యాంటీమైక్రోబయల్ లక్షణాల ఉండటం వల్ల మొటిమలు ఏర్పరిచే వైరస్ల నుండి రక్షించవచ్చు. వెనిగర్ నానబెట్టడం పాదాలపై మొటిమలు పెరగకుండా చికిత్స చేయడానికి లేదా నిరోధించడానికి సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: చలికాలంలో హైబీపీని అదుపులో ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే