ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్లు, కంప్యూటర్స్, ల్యాప్ టాప్ తోనే సగం జీవితం గడిపేస్తున్నారు. ఎందుకంటే అవి లేకపోతే వర్క్ జరగదు. ఇది చాలదు అన్నట్టు మళ్ళీ ఫోన్ స్క్రీనింగ్ టైమ్ కూడా అదనంగా యాడ్ అవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఫోన్ పట్టుకున్నారంటే కనీసం రెండు లేదా మూడు గంటల పాటు అలా చూస్తూనే ఉంటారు. దీని వల్ల కళ్ళు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇక ఉద్యోగులైతే కనీసం తొమ్మిది నుంచి పది గంటల పాటు స్క్రీన్ పై తదేకంగా చూడాల్సి వస్తుంది. ఇది కంటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల కళ్ళు పొడి బారిపోవడం, మంటలు, తలనొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతే కాదు కొంతమంది కంటి చూపు మందగించడం వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అటువంటి సమస్యలు రాకుండా కంటి మీద ఒత్తిడి తగ్గించుకోవాలంటే మీరు ఇలా చేయండి.
20/20 రూల్
నిరంతరం స్క్రీన్ చూస్తున్నప్పుడు మీరు తప్పనిసరిగా 20-20-20 రూల్ పాటించి చూడండి. మీ కంటి మీద ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదు. స్క్రీనింగ్ టైమ్ నుంచి కాసేపు కంటికి విరామం ఇవ్వాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ ఈ నియమం పాటిస్తే చాలా మంచిది. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు విరామ తీసుకోండి. స్క్రీన్ పై కాకుండా వేరే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ దృష్టి కూడా దాదాపు 20 అడుగుల దూరంలో ఉంటే మంచిది. ఇది కంటి ఒత్తిడి తగ్గించడంలో కొద్దిగా సహాయపడుతుంది. స్క్రీన్ కాదు అన్నామని ఫోన్ చూడటం మాత్రం చేయకండి.
కళ్ళు రెప్పలు వేయడం
స్క్రీన్ చూస్తున్నప్పుడు, ఏదైనా పనిలో నిమగ్నమైనప్పుడు రెప్పవేయకుండా తదేకంగా చూస్తూ ఉంటారు. అలా చూడటం అసలు మంచిది కాదు. తప్పనిసరిగా రెప్ప వేయడం చేయాలి. కళ్ళు రెప్పలు వేయడం అనేది కళ్ళలో తేమ స్థాయిని తగ్గించకుండ ఉంచడంలో సహాయపడుతుంది.
వెలుతురు ఉండాలి
చీకటిగా ఉన్న గదులు కాకుండా బాగా వెలుతురుగా ఉన్న గదిలో మీ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ పెట్టుకుని పని చేసుకోండి. ఫోన్ చూసేటప్పుడు కూడా వెలుతురు ఉంచుకోవాలి. కొంతమంది లైట్లు ఆపేసి దుప్పటి ముసుగులు వేసేసుకుని ఫోన్ చూస్తూ ఉంటారు. మసక వెలుతురు కళ్ళని దెబ్బతీస్తుంది. ఇవి కంటిపై మరింత ఒత్తిడిని తీసుకొస్తాయి. స్క్రీన్ నుంచి వచ్చే నీలికాంతి కళ్ళని డ్యామేజ్ చేస్తుంది.
యాంటీ గ్లేర్ వాడాలి
ఎక్కువగా స్క్రీన్ చూసే వాళ్ళు కంటికి హాని కలగకుండా ఉండే యాంటీ గ్లేర్ వాడటం మంచిది. గాడ్జెట్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చేసి స్క్రీన్ నుంచి వెలువడే కాంతిని తగ్గించుకోవాలి. ఫాంట్ పరిమాణం చిన్నవిగా పెట్టుకోవద్దు. మీరు ఉన్న కాంతి ప్రాంతానికి తగిన విధంగా స్క్రీన్ కలర్, లైటింగ్ సెట్ చేసుకోవడం మంచిది.
దూరంగా చూడాలి
కళ్ళకి స్క్రీన్ కి తగిన దూరం పాటించడం చాలా ముఖ్యం. వాటికి దగ్గరగా అందులో మొహం పెట్టి మరీ చూస్తూ ఉంటే కళ్ళు దెబ్బతింటాయి. అలా చేస్తే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కంటికి సంబంధించిన అత్యంత సాధారణ ఆరోగ్య సమస్య. అందుకే దగ్గరగా అసలు చూడొద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఆప్రికాట్ పండ్ల సీజన్ వచ్చేసింది, అతిగా తిన్నారో ఈ సమస్యలు తప్పవు