అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన జాన్వీ కపూర్, ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో బిజీ అవుతోంది. అచ్చం తల్లిలాగే నటన కనబరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలో తెలుగులోకి అడుగు పెట్టబోతోంది. ఎన్టీఆర్ తో కలిసి తొలిసారిగా టాలీవుడ్ ఆడియెన్స్ ను అలరించబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో, జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆమె లుక్ ను కూడా విడుదల చేశారు.
అమ్మ మరణం నుంచి బయటకు రాలేకపోతున్నా - జాన్వీ
తాజాగా జాన్వీ తన తల్లి మరణం గురించి గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఆమెను కోల్పోయిన తర్వాత అనుభవించిన బాధను వివరించింది. “నేను చాలా కాలం పాటు అమ్మ మరణం నుంచి బయటకు రాలేకపోయాను. అమ్మ మరణం ముందు మా జీవితం ఒకలా ఉండేది. ఆమె మరణం తర్వాత మరోలా మారిపోయింది. మేము ఆమెను కోల్పోయినప్పుడు, నా మొదటి చిత్రం షూట్ మధ్యలో ఉన్నాను. ఆమె ఉన్నంత కాలంగా మమ్మల్ని తాను చేయి పట్టుకుని ముందుకు నడిపించినట్లు ఉండేది. ఆ తర్వాత చుట్టూ శూన్యం నిండిపోయినట్లు అనిపించింది. కోవిడ్ సమయంలో ఆమె లేకుండా ఇంట్లో గడపడం భరించలేని విధంగా ఉండేది. నా జీవితంలో ఏర్పడిన శూన్యతను పూడ్చుకునేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నాను. అయినా ఆమె ఆలోచనలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి” అని తెలిపింది.
అమ్మ కారణంగానే మా జీవితం ముందుకు సాగుతోంది - జాన్వీ
తన తల్లి మరణం తమలో భయాన్ని నింపినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. "నేను అమ్మను కోల్పోయినప్పుడు, గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది. ఈ భయంకరమైన అనుభవాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఆమె కారణంగానే మా జీవితం చాలా సులభంగా ముందుకు సాగుతోంది. ఆమె అడుగు జాడల్లోనే ఇప్పుడు ముందుకు సాగుతున్నాం. ప్రపంచంలోని ప్రతి శ్రీదేవి అభిమాని మమ్మల్ని ఆమె లాగే చూస్తున్నారు. ఆమె మీద చూపించిన ప్రేమనే మా మీద చూపిస్తున్నారు” అని వెల్లడించింది.
ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నట్లు జాన్వీ చెప్పింది. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, ‘మిలి’ లాంటి సినిమాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చినట్లు వివరించింది. ఇక త్వరలో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ తో కలిసి అలరించబోతోంది.
Read Also: ‘ఎన్టీఆర్ 30’లో జాన్వీ కపూర్, అధికారికంగా ప్రకటించిన మేకర్స్