టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రవీణ్ 2017లో వచ్చిన ‘దర్శకుడు’ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌ గా పనిచేశారు. జక్కా హరి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అశోక్‌ బండ్రెడ్డి హీరోగా నటించగా, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమా తర్వాత ‘బాజీరావు మస్తానీ’, ‘ధూమ్ 3’, ‘బేబీ’, ‘పంజా’, ‘యమదొంగ’ వంటి సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌ గా కూడా పనిచేశారు ప్రవీణ్. కెమెరామెన్ గా రానిస్తున్న సమయంలోనే ఆయన ఇలా హఠాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల శోక సంద్రంలో మునిగిపోయారు. 



టాలీవుడ్ ను కుదిపేస్తున్న వరుస మరణాలు..



టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస మరణాలు ఇండస్ట్రీను కుదిపేస్తున్నాయి. గతేడాది లో కూడా తెలుగు సినీ పరిశ్రమకు చెంది. ఆ ఏడాది ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, ఘట్టమనేని రమేష్ బాబు, ఘట్టమనేని ఇందిరా, మన్నవ బాలయ్య, నందమూరి ఉమామహేశ్వరి లాంటి ప్రముఖులు మరణించారు. ఇక ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన మరణించిన కొన్ని రోజులకే ఆయన సతీమణి జయలక్ష్మీ కన్నుమూశారు. తర్వాత సీనియర్ నటి జమున ఇలా పలువురు సినీ తారలు మృతి చెందారు. తాజాగా ప్రవీణ్ గుండెపోటుతో మరణించడంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదచాయలు అలముకున్నాయి.  


గుండెపోటుతోనే అత్యధిక మరణాలు...


ఇటీవల కాలంలో గుండెపోటుతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా తర్వాత ఈ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకప్పుడు 40, 50 ఏళ్లు దాటిన వారికి ఈ సమస్య అరుదుగా కనిపించేది. కానీ ప్రస్తుత కాలంలో ఇది విపరీతంగా కనిపిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ఈ గుండెపోటు అందర్నీ వేధిస్తోంది. రోజురోజుకూ ఈ హార్ట్ ఎటాక్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే నందమూరి తారకరత్న గుండెపోటుతో మరణించారు. టీడీపీ పార్టీ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడ నుంచి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తర్వత మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించారు. 23 రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఆయన కోలుకోలేదు. ఫిబ్రవరి 18 న ఆయన ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు హార్ట్ ఎటాక్ తో మరణించారు. టాలీవుడ్ లో వరుస గుండెపోటు మరణాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ఇది ఒక్క సినిమా రంగంలోనే కాదు. దేశ వ్యాప్తంగా ఈ సమస్య రోజురోజుకూ ఎక్కువైపోతుంది. కారణాలు ఏమైనప్పటికీ అతి చిన్న వయసు యువకులు కూడా గుండెపోటు మరణాలకు బలైపోవడం ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి.


Read Also: చావు అంచుల్లోకి వెళ్లి వచ్చా, గుండె పోటుపై సుస్మితా సేన్ ఎమోషనల్!