పచ్చబొట్టు(టాటూ) చూసేందుకు అందంగానే ఉంటుంది. కానీ, దాన్ని పొడిపించుకొనేప్పుడు చుక్కలు కనిపిస్తాయి. పైగా, టాటూలు అందరి శరీరానికి పడకపోవచ్చు. అవి అలర్జీలు కూడా కలిగించవచ్చు. అందుకే, వైద్యులు టాటూలతో అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు. టాటూల వల్ల భవిష్యత్తులో ఉద్యోగం, పెళ్లి విషయాల్లో కూడా ఆటంకాలు ఎదురుకావచ్చని చెబుతున్నారు. అయితే, ఓ తల్లి ఏడాది వయస్సు గల తన పసిబిడ్డకు టాటూలు వేయించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేగాక, ఆ ఫొటోలను ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేస్తూ భారీగా ఫాలోవర్లను కూడా సంపాదించింది. టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా సైట్లలో ఆమెకు తిరుగే లేదు. అయినా ఆమెకు అదేం పాడుబుద్ధి? పాపం ఆ పసివాడికి అలా పచ్చబొట్టు పొడిచేస్తుంటే ఎలా తట్టుకోగలిగాడు? సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడిని హింసిస్తారా? అంటూ నెటిజనులు మండిపడుతున్నారు. ఈ కామెంట్లు చూసి ఆ పసివాడి తల్లి బాధపడటం లేదు. పైగా నవ్వుకుంటోంది. ఎందుకంటే, ఆ పచ్చబొట్లు వెనుక అసలు కథ వేరే ఉంది.
Also Read: ఏంటమ్మా ఏంటీ? సింధూరం పెట్టుకుంటే శృంగార కోరికలు పుడుతాయా?
వాస్తవానికి అవి నిజమైన టాటూలు కాదు. ఫ్లొరిడాకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ షమేకియా మోరిస్‌కు టాటూలంటే చాలా ఇష్టం. దీంతో తన కొడుకు ట్రెలిన్‌కు పుట్టిన ఆరు నెలల వయస్సులోనే పచ్చబొట్లు పొడిపించాలని అనుకుంది. కానీ, పసివాడు ఆ నొప్పిని భరించలేడనే కారణంతో హైపర్‌రియలిస్టిక్ టెంపరరీ టాటూలతో అతడి శరీరాన్ని నింపేసింది. అవి చూసేందుకు నిజమైన టాటూల్లాగానే ఉంటాయి. ప్రస్తుతం ట్రెలిన్ వయస్సు ఒక సంవత్సరం మాత్రమే. షమేకియా మోరిస్ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చేస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. పామ్ బీచ్ ఏరియాలో ఒళ్లంతా టాటూలతో, మెడలో చైన్‌తో ర్యాప్ సూపర్ స్టార్‌లో ట్రెలిన్ కనిపిస్తాడు. అవి తాత్కాలిక టాటూలని నెటిజనులకు చెప్పి చెప్పి షమేకియా అలసిపోయింది. పసివాడి శరీరానికి హానిచేయని సిరతోనే ఆ టాటూ డిజైన్లు వేసినట్లు షమేకియా తెలిపింది. ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా మీ కళ్లను మీరు నమ్మలేరు.
Also Read: చాక్లెట్లు తింటే చిన్న వయస్సులోనే చనిపోతారా? తాజా అధ్యయనంలో ఏం తేలింది?