ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదా? నిద్ర కోసం మీరు మాత్రలు మింగుతున్నారా? వాటితో పనిలేకుండానే మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఇందుకు మీరు మిలటరీ టెక్నిక్ పాటిస్తే చాలు. ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్ జస్టిన్ అగస్టిన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ టెక్నిక్.. ఇప్పుడు ఎంతమందికి ఉపయోగపడుతోంది. మీకు కూడా ఈ టెక్నిక్‌తో మాంచి నిద్ర పట్టవచ్చేమో ప్రయత్నించండి.
మనకంటే.. ఇంట్లో ప్రత్యేకంగా బెడ్ రూమ్స్ ఉంటాయి. హాయిగా నిద్రపోవడానికి మంచాలు ఉంటాయి. ఇన్ని ఉన్నా సరే చాలామందికి నిద్ర పెద్దగా పట్టదు. కానీ, సరిహద్దుల్లో మన కోసం పహారా కాసే సైనికులు నిద్రపోవడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. కేవలం రాళ్లు, రప్పలు లేదా చెట్టు కిందే నిద్రపోవాలి. పైగా అక్కడ అసౌకర్యమైన వాతావరణం ఉంటుంది. యుద్ధాలు జరిగేప్పుడైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. పెద్ద శబ్దాలు, పేలుళ్లు కంటి మీద కనుకును దూరం చేస్తాయి. కానీ, రోజంతా పహారా కాసేందుకు శక్తి ఉండాలంటే తప్పకుండా కొన్ని నిమిషాలైనా నిద్రపోవాలి. అందుకే, సైనికులు షిఫ్టుల వారీగా నిద్రపోతుంటారు. అయితే, వారికి అలాంటి వాతావరణంలో నిద్ర ఎలా పడుతుంది? ఇందుకు టెక్నిక్ ఉంది. అదేంటో చూడండి.
వాస్తవానికి సైన్యంలో.. ఫైటర్ పైలట్‌లు నిద్రపోవడం కోసం ఈ టెక్నిక్‌ను ప్రవేశ పెట్టారు. ఎందుకంటే.. వారు నిఘా, యుద్ధ సమయంలో తప్పకుండా ఫోకస్ పెట్టాలి. ఒక వేళ వారికి సరైన నిద్రలేకపోతే సమస్యల్లో పడతారు. అందుకే వీరి నిద్రపోవడానికి ముందు పూర్తిగా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోతారు. తల నుంచి కాలి వరకు శరీర సడలిస్తారు. ఆ తర్వాత ముఖంలోని నుదిటి కండరాలను కూడా రిలాక్స్ చేస్తారు. నుదిటిని బిగపడితే.. కళ్లు మూయడం కష్టం.
కళ్లు, బుగ్గలు, దవడలను కదపకుండా రిలాక్స్‌గా ఉంచండి. ఆ తర్వాత శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టండి. ఆ తర్వాత మీ మెడ, భుజాల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడండి. భుజాలను బిగపట్టకుండా లూజుగా వదలండి. వాటిపై ఎలాంటి ఒత్తిడి వేయకండి. మీ చేయి, వేళ్లను కూడా వదులుగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఓ వెచ్చని అనుభూతి లభిస్తుంది. తల నుంచి చేతి వేళ్ల వరకు శరీరం ఎంతో తేలిగ్గా అనిపిస్తుంది. లోతైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా ఊపిరి పీల్చండి. ఆ సమయంలో మీ ఛాతి, కడుపు, తొడలు, మోకాలు, పాదాలు కదలకూడదు. అలాగని వాటిని బిగపెట్టకూడదు కూడా. ఆ సమయంలో మీరు మీ శ్వాస మీద మాత్రమే దృష్టి పెట్టాలి. మరే విషయం గురించి ఆలోచించకూడదు. ఒత్తిళ్ల నుంచి మీ మనస్సును తేలికపరుచుకోవాలి. ఇందుకు మీరు రెండు దృశ్యాలను ఆలోచించండి.
‘‘మీరు ప్రశాంతమైన సరస్సులో ఓ పడవలో పడుకున్నారు. మీ పైన నీలి ఆకాశం తప్ప మరేది లేదు’’ అని ఊహించుకోండి. లేదా.. ‘‘మీరు నల్లని గదిలో.. ఓ ఊయలలో పడుకున్నట్లు భావించండి. ఆ సమయంలో మీకు ఏదైనా ఆలోచన వస్తే.. కనీసం 10 సెకన్లపాటు ‘‘ఆలోచించవద్దు, ఆలోచించవద్దు, ఆలోచించవద్దు’’ అని అనుకోండి. ఇలా కనీసం ఆరువారాలు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటైపోతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రలోకి జారుకుని రిలాక్స్ కావచ్చు. కళ్లు మూసుకున్న రెండు నిమిషాల్లోనే నిద్రాలోకంలో విహరిస్తారు. అగస్టిన్ చెప్పిన ఈ టెక్నిక్‌ను చాలామంది ఫాలో అయ్యారు. నిజంగానే అది పనిచేస్తోందని, త్వరగా నిద్రపడుతోందని చెబుతున్నారు. మీరు కూడా ప్రయత్నించి.. ఆ టెక్నిక్ పనిచేస్తుందో లేదో మాకు చెప్పండి. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఉపయోగపడవచ్చు. ఆ స్లీపింగ్ టెక్నిక్‌ను ఈ కింది వీడియోలో చూడండి.