చేపల పులుసు చేయడం చాలా కష్టం అనుకుంటారు చాలా మంది. నిజానికి చాలా సింపుల్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా తొలిసారి చేసే వాళ్ల కోసమే ఈ రెసిపి. ఇందులో అధిక ప్రాసెస్ ఏమీ లేదు. అన్నీ సమంగా వేగాక మేం చెప్పిన విధంగా ఒక్కొక్కటి వేసుకుంటే చాలు చేపల పులులసు రెడీ అయిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
చేపలు - కిలో
ఉల్లిపాయలు - రెండు
టమోటాలు - రెండు
పచ్చి మిర్చి - మూడు
చింతపండు - చిన్న ఉండ
కారం - రెండు స్పూనులు
అల్లం వెల్లుల్లి పేస్టు - మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - ఒక కట్ట
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
పసుపు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
నూనె - అర కప్పు
నీళ్లు - తగినన్ని
తయారీ ఇలా...
1. చేప ముక్కలు శుభ్రంగా నీటితో కడిగాక ఉప్పు, పసుపు పట్టించి కాసేపు పక్కన పెట్టాలి.
2. ఇలా చేయడం వల్ల చేపల నుంచి వచ్చే పచ్చి వాసన తగ్గుతుంది.
3. ఇప్పుడు చింతపండును గోరు వెచ్చని నీళ్లలో నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవచ్చు లేదా మెత్తగా పేస్టు చేసుకోవచ్చు. అది మీ ఇష్టం.
5. టమోటా ప్యూరీని కూడా తీసి రెడీ ఉంచుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లిపాయల తరుగు లేదా ఉల్లిపాయల ముద్ద వేసి వేయించాలి.
7. అవి కాస్త రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ వేయాలి.
8. నిలువుగా తరుక్కున్న పచ్చిమిర్చి, పసుపు వేసి కలపాలి.
9. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి వేయించాలి.
10. అన్నీ పచ్చి వాసన పోయేదాకా వేయించి చింతపండు రసాన్ని వేయాలి.
11. మీకెంత పులుసు కావాలనుకుంటున్నారో అన్ని నీళ్లు కూడా వేయాలి.
12. రసం సలసల కాగుతూ బుడగలు వస్తున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకులు వేయాలి.
13. ఇప్పుడు ముందుగా మారినేషన్ చేసుకున్న చేపముక్కలని వేయాలి.
14. రసం బాగా వేడెక్కి ఉంది కనుక చేపలు కేవలం 20 నిమిషాల్లో ఉడికేస్తాయి.
చేపలు ఎక్కువగా గరిటెతో కలపకూడదు. ముక్కలుగా విడిపోతాయి.చేపలే ఉడికాయో లేదో చూసుకుని, రెండు స్పూన్ల కొత్తిమీర తరుగు చల్లుకుని స్టవ్ కట్టేయడమే. అంతే టేస్టీ ఆంధ్ర చేపల పులుసు రెడీ అయినట్టే. బిగినర్స్ కూడా దీన్ని సులువుగా చేసుకోవచ్చు.
Also read: బొంగులో చికెన్‌లాగే ఇది బొంగులో ఉప్పు, కొనాలంటే ఒక నెల జీతం వదులుకోవాల్సిందే
Also read: మంకీపాక్స్ వ్యాప్తిని అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉంది, ఇలా చేస్తే ఆ వ్యాధి వ్యాపించదు