నో స్మోకింగ్ డే... ధూమపానం చేసేవారి కళ్లు తెరిపించడం కోసం పుట్టుకొచ్చిన ఒక ప్రత్యేక దినోత్సవం. ప్రతి ఏటా మార్చిలో వచ్చే రెండో బుధవారం దీన్ని నిర్వహిస్తారు. ఆ రోజున ధూమపానం చేసేవారిలో అవగాహన నింపేందుకు పలు కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తాయి. నేటి దినోత్సవం ఉద్దేశం ఒక్కటే... రెండు నిమిషాల పాటు సిగరెట్ ఇచ్చే కిక్కు కోసం వెంపర్లాడితే, మీ శరీరరం ఆ సిగరెట్ పొగకు కాలిపోతోందని, ఎన్నో భయంకరమైన ఆరోగ్యసమస్యలు దాడి చేసే అవకాశం నూటికి నూరుశాతం ఉందని చెప్పడమే. ప్రపంచ గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయి.
1. సిగరెట్ తాగాక వదిలే పొగలో 7000 కంటే ఎక్కువ రసాయనాలు విడుదలవుతాయి. వాటిలో 250 చాలా హానికరమైనవి. క్యాన్సర్ వంటి రోగాలను కలిగిస్తాయి.
2. ధూమపానం వల్ల ప్రపంచంలో ఏడాదికి 70 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. 2030 నాటికి ఆ సంఖ్య 80 లక్షలకు చేరుతుందని అంచనా.
3. చట్టబద్ధంగా అమ్ముతున్న హానికర వస్తువు పొగాకు. ఇది తనను ఉపయోగించే వినియోగదారుల్లో సగం మందిని చంపే అవకాశం ఉంది.
4. ప్రపంచ జనాభాల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే ధూమపానానికి సంబంధించి రూపొందించిన చట్టాల ద్వారా సురక్షితంగా ఉన్నారు. మిగిలినవారంతా ఆ పొగకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధితులుగా ఉన్నారు.
5. ధూమపానం ఇచ్చే కిక్కు కోసం చూసుకుంటే మగవారిలో లైంగిక పటుత్వం తగ్గిపోతుంది. శరీరంలోని రక్త నాళాలు సంకోచించేలా చేస్తుంది.
6. సిగరెట్ తాగే మహిళల్లో అధికంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ప్రాణాంతకమైన సమస్య.
7. ధూమపానం అధికంగా చేసేవారిలో త్వరగా దంతాలు రాలిపోతాయి. అలాగే పీరియాంటైటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. దంతాలను పట్టి ఉంచే ఎముకను కూడా నాశనం చేసే ఒక చిగుళ్ల ఇన్ఫెక్షన్ ఇది.
8. పొగాకు వల్ల నిమోనియా, ఎంఫిసెమా, తీవ్ర బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం అధికం.
ఒక్క చైనాలోనే...
చైనాలో 300 మిలియన్ల మంది ధూమపానం చేస్తున్నారు. వారు ఏడాదిలో దాదాపు 1.7 ట్రిలియన్ సిగరెట్లను కాలుస్తున్నారు. అంటే నిమిషానికి దాదాపు మూడు మిలియన్ సిగరెట్లను వినియోగిస్తున్నారు. అంటే ఇక ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో సిగరెట్ల అమ్మకాలు,వినియోగం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
మనదేశంలో...
మనదేశంలో దాదాపు 120 మిలియన్ల మంది పొగాకు ప్రియులు ఉన్నారు. అంటే దాదాపు 12 కోట్ల మంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచంలో ఉన్న స్మోకర్లలో 12 శాతం మంది భారత్ లోనే ఉన్నారు. ఏటా పదిలక్షల మంది మనదేశంలోనే మరణిస్తున్నారు.
Also read: సిగరెట్ మానేయలేకపోతున్నారా? ఇవిగో ఈ చిట్కాలు పాటించి చూడండి
Also read: మనం చనిపోయే ముందు మెదడులో ఏం జరుగుతుంది? తెలుసుకునేందుకు బ్రెయిన్‌ను మ్యాప్ చేసిన శాస్త్రవేత్తలు