ప్రతి ఏడాది మార్చిలో రెండో బుధవారాన్ని ‘నో స్మోకింగ్ డే’గా నిర్వహిస్తారు. ఈ రోజున ధూమపానం వల్ల కలిగే ఆరోగ్యనష్టాలను తెలియజేయడంతో పాటూ ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల వినియోగాన్ని అరికట్టే మార్గాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సిగరెట్ కాల్చే వారికే కాదు, ఆ పొగ గాలిలో కలిసి పీల్చే వారికి కూడా తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణించడం, క్యాన్సర్ ముప్పు వంటివి పెరుగుతాయి. కొందరు సిగరెట్‌కు బానిసలుగా మారుతున్నారు. మానేయాలనుకున్నా మానలేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు కొన్ని చిట్కాల ద్వారా సిగరెట్ మానేయడానికి ప్రయత్నించవచ్చు. 


1. ధూమపానం చేయాలనే కోరికను పెంచే వాటిని ట్రిగ్గర్లు అంటారు. అంటే ఇవి సిగరెట్ తాగాలన్న కోరికను పెంచేస్తాయి. అలా ప్రేరేపించే ట్రిగ్గర్లుగా సిగరెట్ పొగ, లైటర్లు, ధూమపానం చేసే స్నేహితులు... చెప్పుకోవచ్చు. మీరు సిగరెట్ మానేయాలనుకుంటే వీటికి దూరంగా ఉండండి.అలా కొన్నినెలల పాటూ ఉంటే మీకు ధూమపానంపై ఆసక్తి పోతుంది. 


2. సిగరెట్ మానేయడం అంత సులువు కాదు. ఈ ప్రక్రియ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా అనిపిస్తాయి. అన్నింటినీ తట్టుకోవాలంటే మీరు సాత్వికమైన ఆహారాన్ని తినడమే కాదు రోజూ వ్యాయామం చేయాలి. ధ్యానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మీరు మానసికంగా ఎంత గట్టిగా ఉంటే అంత త్వరగా ధూమపానాన్ని వదిలించుకోవచ్చు. ముందుగా మీరు ధూమపానాన్ని దూరం పెట్టాలన్న నిర్ణయానికి రావాలి. 


3. మీకు ఇష్టమైన వారి సాయంతో ఈ చెడు అలవాటుకు అడ్డుకట్ట వేయచ్చు. వారి ప్రేమ మిమ్మల్ని ధూమపానానికి దూరంగా చేస్తుంది. సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా మీ పిల్లలు లేదా తల్లి, భార్యతో కాసేపు గడపండి. 


4. ఎంత ప్రయత్నించినా ధూమపానం మానడం మీ వల్ల కాకపోతే వైద్యుల సలహా తీసుకోండి. నికోటిన్ ప్యాచ్‌లు ఈ విషయంలో ఉపయోగపడతాయి. అలాగే ప్రిస్క్రిప్షన్ మాత్రలు కూడా ధూమపానాన్ని మానేలా చేస్తాయి. మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల క్షేమం కోసం ధూమపానాన్ని మానడం చాలా అవసరం. స్మోకింగ్ మానేసి చూడండి... ఊపిరితిత్తులు వాటికవే మళ్లీ ఆరోగ్యంగా మారుతాయి. 


Also read: భారతీయ అమ్మాయిలకు బీర్ ఎందుకు నచ్చేస్తోంది? నిజంగానే అది అందాన్ని పెంచుతుందా?



Also read: షాకింగ్, కరోనా వ్యాక్సిన్ల వల్ల లుకేమియా వచ్చే అవకాశం? చెబుతున్న చైనా ఆరోగ్య సంస్థ