ఆహారానికి రుచిని ఇచ్చేది ఉప్పే. కానీ పరిమితికి మించి వాడే ఉప్పు గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే శరీరంలో ఎక్కువగా చేరిన ఉప్పు నీటిని నిలిపి ఉంచుతుంది. ఫలితంగా శరీరంలో రక్తం పరిమాణం పెరుగుతుంది. రక్తపరిమాణం పెరిగితే గుండె మరింత ఎక్కువ పనిచెయ్యాల్సి వస్తుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందని నిపుణులు వివరణ ఇస్తున్నారు.


గుండె జబ్బుల నివారణ గురించి చర్చ సాగుతున్నపుడు కచ్చితంగా గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చెయ్యడంలో ఉప్పు పాత్ర ను విస్మరించలేం. ఉప్పు ప్రభావం నేరుగా రక్తపోటు మీద ఉంటుంది. అదుపులో లేని రక్తపోటు ఇది గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సోడియం ఇన్ టేక్ రిడక్షన్ గురించి ఒక నివేదిక విడుదల చేసింది. 2025 నాటికి ఇప్పుడు వాడుతున్న సోడియం లో 30 శాతం వరకు తగ్గించాలనేది లక్ష్యంగా సాగాలని ప్రపంచదేశాలకు సూచించింది. ఇప్పటికి చాలా దేశాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంలో నిర్లక్ష్యం కూడదని కూడా వ్యాఖ్యానించింది. 1.89 మిలియన్ల మరణాలు సోడియం ఇన్ టేక్ మీద నియంత్రణ కరువవడం వల్లే జరుగుతున్నాయని డేటా వివరిస్తుంది.


ఉప్పు రక్తపరిమాణాన్ని పెంచుతుంది, రక్త పోటు పెరగడానికి కారణం అవుతుంది. కాలం గడిచే కొద్ది రక్తనాళాల గోడపైన పెరిగిన రక్తపోటు ప్రభావం చూపుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో ప్లేక్ పేరుకుపోతుంది. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఉఫ్పులోని సోడియం రక్తంలో నీటి శాతాన్ని పెంచుతుంది. కనుక ఉప్పు తగ్గించి తీసుకోవడం అవసరం.


ప్రస్తుతం పెద్ద వారు రోజుకు 2000 మిల్లీ గ్రాములు లేదా 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదని డబ్య్లూహెచ్ఓ సిఫారసు చేస్తోంది. అయితే సగటున్న ప్రతి వ్యక్తి రోజుకు  4,310 మిల్లీ గ్రాముల వరకు ఉప్పు వాడుతున్నారట. రోజుకు 10. 78 గ్రాములకు ఇది సరిసాటి. ఇది శారీరక అవసరాల ఉపయోగ పరిమాణం కంటే చాలా ఎక్కువ అని ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ప్యాక్డ్ ఫూడ్, పానీయాల ఉత్పత్తి, వినియోగం మీద నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది.


140 mm Hg నుంచి 145 mmHg వరకు 3 నుండి 5 mm Hg వరకు రక్తపోటు పెరుగుదల గురించి అందరికీ అవగాహన ఉండాలి.  ఇది గుండెపోటు ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఉప్పు రక్తపోటు పెంచేందుకు దోహదం చేసే ప్రధాన కారఖం అని గుర్తుంచుకోవాలి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో 2014 లో ప్రచురించిన ఒక అధ్యయనం లో రోజుకు 3-6 గ్రాముల సోడియం తీసుకోవడం సరైన పరిమితిగా సూచించారు. మూత్రంలో సోడియం పరిమాణం కంటే పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉండడం హృదయ ఆరోగ్యానికి మేలు చేసే విషయంగా గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.


సాధారణంగా సోడియం ఎక్కువగా ఉండే పదార్థాలలో కొవ్వు, క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు పెరగడం, స్థూలకాయానికి కారణం కావచ్చు. కొన్ని అధ్యయనాల్లో సోడియం ఎక్కువగా తీసుకునే వారిలో ఆస్టియోపోరోసిస్, జీర్ణాశయ క్యాన్సర్ కు కూడా కారణం అవుతున్నట్టు గుర్తించారు. చాలా కాలం పాటు  ఉప్పు ఎక్కువగా డే ఆహారాన్ని తీసుకుంటే అది అలవాటుగా మారుతుంది. రోజురోజుకు తీసుకునే ఉప్పు పరిమాణం పెరుగుతూ ఉంటుంది.


ఉప్పు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు


టెబుల్ మీద సాల్ట్ డబ్బా తీసెయ్యాలి.



  • వండే సమయంలో వేసిన ఉప్పు కంటె ఎక్కువ వాడకుండా భోజనం పూర్తిచెయ్యాలి.

  • ప్రాసెస్డ్ ఫూడ్ వీలైనంత తగ్గించాలి. వీలైతే మానెయ్యడం మంచిది

  • పాపడ్, ఊరగాయల వంటివి తీసుకోవడం తగ్గించాలి.

  • సలాడ్ వంటి కొన్నింటిలో ఉప్పు రుచి తగలకపోవచ్చు కానీ వాటిలో సోడియం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. బయట తింటున్నపుడు సూప్ లేదా సాస్ ఉపయోగించే తినే పదార్థాలను ఆర్డర్ చెయ్యక పోవడమే మంచిది.

  • సముద్రపు ఉప్పయినా, పింక్ సాల్ట్ ఏదైనా సరే అందులో సోడియం ఉంటుందని మరచి పోవద్దు. ఉప్పు ఏదైనా సరే తగ్గించి తీసుకోవడం తప్పనిసరి.

  • ఇంట్లో వండిన ఆహారంలో కంటే రెస్టారెంట్లలో తినే ఫూడ్, ప్యాక్డ్ ఫూడ్ లో ఎక్కువ ఉప్పు వాడుతుంటారు కనుక బయటి తిండి మానెస్తే సగం ఉప్పు వినియోగం తగ్గించినట్టే.


Also Read: వేసవిలో ఐస్ యాపిల్స్ తింటే చాలా మంచిదట - ప్రయోజనాలివే!