కరోన తర్వాత అంతగా భయపెడుతున్న వ్యాధి మంకీ పాక్స్. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. ఇండియాలోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. అయితే ఇదేమి ప్రమాదకరమైనది కాదని కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దీన్నుంచి తేలికగా బయట పడొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది రెండు నుంచిఈ నాలుగు వారాల పాటు ఉంటుంది.
లక్షణాలు
చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. ఒంటి మీద ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు వస్తాయి. జ్వరం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, చలి వంటి సంకేతాలు కనిపిస్తాయి. కొద్ది రోజుల తర్వాత శరీరంపై ఎర్రటి దద్దుర్లు వచ్చి చీము పడతాయి. ఈ ప్రక్రియ అంతా జరిగేందుకు రెండు నుంచి నాలుగు వారాల పాటు జరుగుతుంది.
నివారణ చర్యలు
వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలి. వాళ్ళు ఉపయోగించిన దుస్తులు వేసుకోవడం, వైరస్ సోకి చనిపోయిన జంతువులని పట్టుకోవడం వంటివి చేయకూడదు. వైరస్ సోకిన వ్యక్తులు శరీరమంతా కప్పి ఉంచే విధంగా ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. బాగా ఉడికించిన మాంసం, కూరగాయలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయటకి వెళ్ళిన సమయంలో ముక్కు, నోరు కవర్ చేసే విధంగా మాస్క్ ధరించి ఉండటం మంచిది. మంకీ పాక్స్ సోకిన వ్యక్తులు ఉన్న ప్రదేశాన్ని క్రిమి సంహరక మందులు వేసి శుభ్రం చేసుకోవాలి. వాళ్ళ దగ్గరకి వెళ్లేటప్పుడు పీపీఈ కిట్ ధరించి వెళ్ళడం ఉత్తమం అని ప్రముఖ వైద్యులు కుమార్ సూచిస్తున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూడా దీన్నుంచి బయట పడొచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* దద్దుర్లు ఎప్పుడూ తేమ లేకుండా పొడిగా ఉండే విధంగా చూసుకోవాలి. ఆ ప్రాంతాన్ని రక్షించడానికి దుస్తులు నిండుగా వేసుకోవాలి.
* నోటిలో లేదా కళ్ళల్లో బొబ్బలు వస్తే వాటిని తాకకూడదు.
* బాగా విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కువగా ద్రవాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. జ్వరం నుంచి ఉపశమనం పొందేందుకు పారాసెటమాల్ వేసుకోవాలి.
* చర్మం మీద ఎర్రపడిన గాయాలకు యాంటీ సెప్టిక్ క్రీములు ఉపయోగించవచ్చు.
* శరీరం డీహైడ్రేట్ అవకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి.
* ఓ ఆర్ ఎస్ వంటి వాటిని తీసుకోవాలి.
* పౌష్టికాహారం తీసుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: నెయ్యి అన్నం ఇలా చేస్తే పిల్లలు వదలకుండా తినేస్తారు
Also read: తరచూ పండ్లు తినే వారిలో డిప్రెషన్ వచ్చే అవకాశం తక్కువ, చెబుతున్న కొత్త అధ్యయనం