కొన్నేళ్ళ క్రితం వేసవి కాలం వచ్చిందంటే చాలు రోడ్ల మీద ఎక్కడ చూసిన మట్టి కుండలే దర్శనమిస్తాయి. కుండలో ఉన్న చల్లటి నీటిని తాగేందుకే ఇష్టం చూపించేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో ఇవి తప్పకుండా ఉండేవి. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఫ్రిజ్ లు రావడంతో మట్టి కుండలు మరుగయ్యాయి. ప్రతి ఒక్కరూ ఫ్రిజ్ లు కొనుక్కోవడం అందులో బాటిల్స్ నీటిని పెట్టుకుని తాగేయడం చేస్తున్నారు. ఇప్పుడు మట్టి కుండలు కేవలం ఇళ్ళల్లో షోకేసుల్లో అందంగా ఉండటం కోసం పెట్టుకుంటున్నారు. కానీ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలంటే ఫ్రిజ్ నీటి కంటే కుండలోని నీళ్లే ఉత్తమం అని పెద్దలు చెప్తారు. కుండలో మంచి నీళ్ళు తాగడం వల్ల మనసుకి హాయిగా ఉండటమే కాదు అనేక అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భవస్వర్ చెప్తున్నారు.
ఎసిడిటీ, మైగ్రేన్, పొత్తికడుపు మరియు శరీరం మొత్తం మంట, వాంతులు మరియు తలనొప్పి వంటి వేడి సమస్యలను ఎదుర్కొంటున్న రోగులు తన దగ్గరకి వచ్చినప్పుడు మట్టి కుండలో నీటిని తాగమని సూచించినట్లు చెప్పారు. వాళ్ళు తమ దినచర్యలో భాగంగా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తీసుకోవడం వల్ల గణనీయమైన మార్పులు రావడం గమనించినట్లు డాక్టర్ చెప్పారు. పంచభూతాల్లో ఒకటైన భూమి/మట్టి తో దీన్ని తయారు చెయ్యడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వేసవి తాపం, శరీరం డీహైడ్రేట్ నుంచి బయటపడేసేందుకు కుండలోని నీళ్ళు గొప్ప ఔషధంలాగా పని చేస్తాయని అంటున్నారు.
ఆల్కలిన్ స్వభావాన్ని తగ్గిస్తుంది
మట్టి కుండ PH ను సమతుల్యం చేయడం ద్వారా అందులో ఉండే నీటిలోని ఆమ్ల స్వభావం లేదా యాసిడ్ కంటెంట్‌ను తగ్గిస్తుంది. ఇది ఎసిడిటీ మరియు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలను అరికట్టడంలో సహాయపడుతుంది.
జీవక్రియని మెరుగుపరుస్తుంది
మట్టి కుండలు BPA (బిస్ఫినాల్ A, ప్రధానంగా ప్లాస్టిక్‌ల తయారీకి ఉపయోగించబడుతుంది) లేని పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది సహజంగా జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు మీ శరీరంలో టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నీటిని చల్లగా ఉంచుతుంది
మట్టి కుండ నీటిని సహజమైన పద్ధతిలో చల్లబరుస్తుంది. నీటి ఉష్ణోగ్రతను 5 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. ఫ్రిజ్ లో పెట్టిన నీరు కంటే మట్టి కుండలో నీళ్లే రుచిగా ఉంటాయి.
వడదెబ్బ నుంచి ఉపశమనం
వేసవిలో చాలా మంది ఎదుర్కొనే ఇబ్బందుల్లో వడదెబ్బ ఒకటి. మట్టి కుండలోని నీటిలో సమృద్ధిగా ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇవి వడదెబ్బ తగిలిన వ్యక్తులు తాగడం వల్ల త్వరగా కోలుకుంటారు. అంతే కాదు మట్టి కుండలోని నీరు సహజ సిద్ధంగా శుద్ధి చేయబడుతుంది. ఇందులో పోసిన నీటిని కేవలం 4 గంటల్లోనే శుద్ధి చేయబడతాయి. అందుకే పాత కాలం రోజుల్లో అందరూ మట్టి కుండలు, కూజాల్లో నీటిని తాగేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం కూడా కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మట్టి పాత్రలనే వంటకి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కుండాలకి కూడా ట్యాప్ పెట్టి అమ్ముతున్నారు. సులువుగా నీటిని తీసుకుని తాగేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు.
Also read: చారు పొడి కొనుక్కుంటున్నారా? ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు
Also Read: దాల్చిన చెక్క వల్ల షుగర్ అదుపులో ఉంటుందా? నిపుణులు ఏం చెప్తున్నారు?