ఖాళీగా ఉన్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఏదైనా పని చేస్తున్నా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. చెవుల్లో కొన్ని గంటల పాటు హెడ్ ఫోన్స్ ఉండడం వల్ల శరీరానికి ఎంతో హాని కలుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం హెడ్‌ఫోన్స్ అధికంగా వాడడం వల్ల, శారీరకంగా హాని కలగడమే కాదు, వాటికి బానిసలుగా కూడా మారిపోతారు. అంటే ఇయర్ ఫోన్స్ చెవిలో లేకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం సుమారు వందకోట్ల మంది యువత కేవలం ఈ ఇయర్ ఫోన్స్ కారణంగా వినికిడి లోపం వచ్చే ప్రమాదం అంచున ఉన్నారు. 


ప్రభావాలు తప్పవు
ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడే వారిలో కొన్నాళ్లకు వినికిడి సామర్థ్యం తగ్గుతుంది. మన చెవుల వినికిడి సామర్థ్యం కేవలం 90 డెసిబుల్స్ మాత్రమే. నిరంతరం ఇయర్ ఫోన్స్ లో పాటలు వినడం వల్ల ఆ సామర్థ్యం 40 నుంచి 50 డిజిబెల్స్‌కు పడిపోతుంది. అంటే దూరం నుంచి వచ్చే శబ్దాలను మీరు వినలేరు. 


గుండె జబ్బులు 
సంగీతం వినడం వల్ల చెవులకు మాత్రమే సమస్య అనుకుంటాం, కానీ అది గుండెతో కూడా ముడిపడి ఉంది. ఆ సంగీతం హృదయ స్పందనను వేగవంతం చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా గుండెకు నష్టం కలగక తప్పదు. 


తలనొప్పి
హెడ్ ఫోన్లో నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు, మెదడుపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలకు కారణం అవుతుంది.  అంతేకాదు ఎక్కువ కాలం పాటు ఇయర్ ఫోన్లో సంగీతం వినే వాళ్ళలో నిద్రలేమి, స్లీప్ ఆప్నియా  వంటి నిద్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


చెవి ఇన్ఫెక్షన్ 
ఇయర్ బడ్‌లు నేరుగా చెవి లోపలకి ప్లగ్ చేస్తారు. అంటే గాలి లోపలికి చొరబడకుండా ఇవి అడ్డంకిగా ఉంటాయి. ఈ అడ్డంకుల వల్ల చెవిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది.  దీనివల్ల చెవి రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. హానికరమైన బ్యాక్టీరియా చెవి నుండి మరొక చెవికి చేరవచ్చు. దీనివల్ల వినికిడి సామర్ధ్యం తగ్గిపోతుంది. 


చూపు మసకబారడం 
చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు అవి కర్ణభేరిపై భారీ ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ధ్వని చెవుల నుండి మెదడుకు నేరుగా ప్రయాణిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీంతో దృష్టి సంబంధ సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు చెవిలో ఇయర్ ఫోన్లు వాడడం వల్ల ఏకాగ్రత తగ్గిపోతుంది. చదువు సరిగా తలకెక్కదు. 


ఒత్తిడి 
హెడ్ ఫోన్లను రోజులో ఎక్కువ గంటల పాటు వాడేవారి సామాజిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి. పనిచేసే సామర్ధ్యం తగ్గిపోతుంది. మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుంది. 


జ్ఞాపకశక్తి
నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. ఏదైనా విషయాన్ని గ్రహించే శక్తి, జ్ఞాపకశక్తి కూడా ప్రభావితం అవుతుంది. దీనివల్ల పిల్లలకు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఇయర్ ఫోన్స్ ఇవ్వకపోవడమే మంచిది. 


Also read: మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు రకాల ఆహారాలు ఇవే



























































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.