ఆల్కహాల్ తాగేవారి సంఖ్య ఎక్కువ. రాత్రయితే చాలు కనీసం ఒక పెగ్గు అయినా వేశాకే నిద్రపోయే వారు ఎంతో మంది. అయితే తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదని అనుకుంటారు. అధ్యయనాల ప్రకారం ఆల్కహాల్ ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా కూడా శరీరంపై చాలా ప్రభావం పడుతుంది. సర్వేల ప్రకారం 2020లో భారతదేశంలో ఆల్కహాల్ వినియోగం దాదాపు ఐదు బిలియన్ లీటర్లకు చేరుకుంది. 2024 నాటికి దాదాపు 6.21 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. రోజూ తాగే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆల్కహాల్ వినియోగం అనేక ప్రాణాంతక పరిస్థితులకు కారణం అవుతుంది. 


జనవరి 2023లో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆల్కహాల్ విషయంలో అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. WHO ఆల్కహాల్‌ను విషపూరితమైన, సైకోయాక్టివ్ పదార్థంగా పేర్కొంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ ఆల్కహాల్‌ను గ్రూప్ 1 కార్సినోజెన్‌గా ప్రకటించారు. అంటే ఆల్కహాల్ వినియోగం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనిలో ఇథనాల్ అధికంగా ఉంటుంది. ఇది పొట్ట, మెదడు, గుండె, పిత్తాశయం, కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆల్కహాల్ అధికంగా తాగితే హేమరాయిడ్లు వచ్చే అవకాశం ఉంది. రోజూ ఎంతో కొంత మొత్తంలో మద్యం తాగితే కాలేయం వాపు వస్తుంది. ఇశది కాలేయం సిర్రోసిస్ సమస్యకు కారణం అవుతుంది. 


ఆల్కహాల్ గుండె కండరాలను దెబ్బతీస్తుంది. కార్డియోమయోపతి వంటి సమస్యలకు కారణమవుతుంది. మద్యం సేవించే వారికి న్యుమోనియా, క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంది. WHO డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 8.1% మందిలో క్షయ వ్యాధులు ఆల్కహాల్ వల్లే వస్తున్నాయి. ఆల్కహాల్‌లో ఉండే ఇథనాల్ శరీరంలో విచ్ఛిన్నమై అసిటాల్టిహైడ్ గా మారుతుంది. ఇది ఒక విష రసాయనం, డీఎన్ఏను దెబ్బతీస్తుంది. ఇదొక క్యాన్సర్ కారకం. ఇథనాల్ ఆక్సీకరణ ద్వారా డీఎన్ఏలోని ప్రొటీన్లను దెబ్బతీసే రియాక్టివ్ ఆక్సిజన్ మూలకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది అనేక శారీరక విధులకు కీలకమైన విటమిన్లు, మినరల్స్ వంటి వివిధ రకాల అవసరమైన పోషకాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది.


ఆడవారిలో కూడా ఎంతో మందికి మద్యం తాగే అలవాటు ఉంది.  ఇది ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. దీని వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ తక్కువ మొత్తంలో తాగినా కూడా  రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, పురీషనాళ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. 


క్రమం తప్పకుండా రోజూ ఆల్కహాల్ తీసుకునేవారిలో చాలా మార్పులు వస్తాయి. మూడ్‌లో మార్పు వస్తుంది. చిరాకు కలుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. లైంగిక జీవితంపై కూడా ప్రభావం పడుతుంది. ఆకలి తగ్గడం,  బరువు తగ్గడం వంటివి జరుగుతాయి. జ్ఞాపకశక్తి,  ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది. మద్యం ప్రభావం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. 


Also read: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక





























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.