మెదడు వాపు వ్యాధి (Encephalitis - ఎన్ సెఫలైటిస్) అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. అనేక కారణాల వల్ల మెదడులోని నాడి కణాలలో వాపు ఏర్పడి వాటి పని తీరులో అవరోధాలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి ఏర్పడుతుంది. ఈ వ్యాధి వృద్ధి కాలాన్ని బట్టి స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మెదడు వాపు వ్యాధిగా విభజిస్తారు. సాధారణంగా స్వల్పకాలిక మెదడు వాపు వ్యాధిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మెదడు వాపు వ్యాధి పిల్లలలో ఎక్కువగా నమోదవుతుంది. వ్యాధి తీవ్రత, మరణాల సంఖ్య కూడా పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాలలో ఏటా దాదాపుగా 20 - 30 వేల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన దేశంలో ఈ కేసులు రేటింపు సంఖ్యలో నమోదవుతుంటాయి. అందువల్ల మెదడు వాపు వ్యాధి గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో సనత్ నగర్‌లోని రెనోవా హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్.చక్రధర్ రెడ్డి ‘ఏబీపీ దేశం’తో మాట్లాడుతూ మెదడు వాపు వ్యాధికి గల కారణాలు, చికిత్స, నివారణ మార్గాలను గురించి వివరించారు.
మెదడు వాపు వ్యాధికి గల కారణాలను ఇన్ఫెక్టివ్, నాన్ ఇన్ఫెక్టీవ్‌గా విభజించారు.
ఇన్ఫెక్టివ్: భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపుగా 30% మెదడు వాపు వ్యాధి కేసులు వైరస్‌ల వల్ల కలుగుతాయి. ప్రాముఖ్యంగా జపనీస్ ఎన్ సెఫలైటిస్ (JE) వైరస్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (HSV), మీజిల్స్ వైరస్, రేబిస్ వైరస్, ఇన్ఫ్లుఎంజా వైరస్, ఇతర వైరస్‌లు కారణం అవుతాయి. మెదడు వాపు వ్యాధిని కలిగించే వైరస్ లు డెంగ్యూ దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. బ్యాక్టీరియా, పారసైట్స్ కూడా మెదడు వాపు వ్యాధిని కలిగించవచ్చు.
నాన్ ఇన్ఫెక్టివ్: వైరస్‌లే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా మెదడు వాపు వ్యాధి ఏర్పడుతుంది. విషపదార్థాలు, ఆటోఇమ్యూనిటీఃకి సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల వాక్సినేషన్ వల్ల కూడా మెదడు వాపు కలిగే అవకాశం ఉన్నది.
లక్షణాలు: మెదడు వాపుతో బాధపడుతున్న రోగిలో తలనొప్పి, జ్వరం, వాంతులు, మతిస్థిమితం తప్పడం, అపస్మారక స్థితి, మూర్ఛ, కదలిక లోపాలు ఏర్పడతాయి. వీటిలో ఏ ఒక్కటి కనిపించినా మీరు వైద్యుడిని సంప్రదించాలి.
నిర్ధారణ: మెదడు వాపు వ్యాధి గల కారణాలను నిర్ధారణ చేయుటకు పలు రకాల పరీక్షల అవసరం ఉంటుంది. సాధారణంగా రక్త పరీక్షలతో పాటు, వైరస్‌లకు సంబంధించిన యాంటీబాడీ పరీక్ష, PCR పరీక్ష, వెన్ను నీరు పరీక్ష, EEG, MRI స్కాన్‌ల ద్వారా మెదడు యొక్క పనితీరు మెదడు వాపు యొక్క తీవ్రతను గుర్తించుటకు వీలు పడుతుంది.
Also Read: ఈ నగరాల్లో నివసిస్తున్నారా? మీరు ఎంత సెక్స్ చేసినా ‘ఆ ఫలితం’ ఉండదు, కారణం ఇదే!
చికిత్స: మెదడు వాపు వ్యాధి రోగులకు న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో వైద్యం అందించబడుతుంది. కొన్ని రకాల వైరస్ లకు మాత్రమే యాంటీ వైరల్ మందులు అందుబాటులో ఉన్నాయి. మెదడు వాపు వ్యాధి ఉన్న రోగులకు మూర్ఛ నివారణ మందులు, నాడి కణాలలో వాపును తగ్గించుటకు మందులు, ఇతర కారణాలకు సంబంధించిన మందులు, సాధారణ సంరక్షణతో పాటుగా అందించటం జరుగుతుంది.
❂ మెదడు వాపు వ్యాధి లక్షణాలతో ఉన్న వ్యక్తులకు వీలైనంత త్వరగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి చికిత్స అందించడం చాలా అవసరం. వ్యాధి తీవ్రత, వ్యాధి నిర్ధారణ, చికిత్స అందె సమయాన్ని బట్టి రోగి రికవరీ ఉంటుంది.
❂ మెదడు వాపు వ్యాధి తీవ్రంగా ఉన్న రోగులలో కొంత వరకు నాడి కణాలు శాశ్వతంగా దెబ్బతిని సంపూర్ణంగా కోలుకోలేకపోతారు. ఇలాంటి మెదడు వాపు వ్యాధి తరువాత వైకల్యం, మూర్చ రోగం కొనసాగే అవకాశం ఉంటుంది.
Also Read: ఉదయాన్నే శృంగారంలో పాల్గోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
నివారణ: కొంత వరకు వైరస్‌ల వల్ల కలిగే మెదడు వాపు వ్యాధిని మనం నివారించవచ్చు. జపనీస్ ఎన్ సెఫలైటిస్ (JE), డెంగ్యూ వైరస్ లు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, దోమల నివారణ కార్యక్రమాల ద్వారా ఈ జబ్బుల బారి నుండి కాపాడుకోవచ్చు. పిల్లలకు సకాలంలో టీకాలు వేయించటం వల్ల కూడా కొన్ని రకాల మెదడు వాపు వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.