ఎప్పుడూ ఆలూ పరాటానే తింటే బోర్ కొట్టేస్తుంది. అప్పుడప్పుడ టేస్టులు మారాల్సిందే ఆలూ పరాటా బదులు ఈసారి గుడ్డుతో పరాటా చేసి చూడండి. రుచికి రుచికి, బలానికి బలం. ముఖ్యంగా పిల్లలకు బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ టైమ్ లో ఇది బావుంటుంది. వాళ్లు ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతేకాదు వారి మెదడు చురుగ్గా పనిచేయడానికి గుడ్డులోని పోషకాలు చాలా అవసరం. దీన్ని తయారు చేయడం కూడా పెద్ద కష్టమేం కాదు. 


కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
గుడ్లు - రెండు
పచ్చి మిరపకాయలు - ఒకటి
కారం - ఒక టీస్పూను
కొత్తి మీర తరుగు - ఒక టీస్పూను
నూనె - రెండు స్పూనులు
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగేయాలి)
టొమాటో తరుగు- ఒకటిన్నర స్పూను 
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - అర స్పూను
నీళ్లు - సరిపడినన్ని


తయారీ ఇలా
1. చపాతీ పిండిని కలుపుకోవాలి. ఉప్పు, కాస్త ఆయిల్, గోరువెచ్చని నీళ్లతో కలిపితే పిండి బాగా కలుస్తుంది. పరాటా మెత్తగా వస్తుంది. అలా కలిపాక ఓ 20 నిముషాలు పక్కన పెట్టాలి. గాలి తగలకుండా మూత పెట్టాలి. 


2. ఒక గిన్నె తీసుకుని అందులో రెండు గుడ్లు కొట్టి వేయాలి. పచ్చి మిర్చి తరుగు, ఉల్లి పాయ తరుగు, టొమాటో తరుగు, కొత్తిమీర తరుగు, కారం, పసుపు, ఉప్పు అన్ని వేసి బాగా గిలక్కొట్టాలి. 


3.ఇప్పుడు పిండి ముద్దని తీసి పొరలు పొరలుగా వచ్చేలా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకున్న పరాటాని పెనంపై వేసి కాల్చాలి. 


4. రెండు వైపులా సగం కాలాక, పరాటా పై పొరని చిన్న చాకుతో కోయాలి. పరాటా సంచిలా ఓపెన్ అవుతుంది. అందులో గిలక్కొట్టిన ఎగ్ మిశ్రమాన్ని వేయాలి. 


5. మళ్లీ చపాతీని పెనంపై కాసేపు ఉంచాలి. లోపలి గుడ్డు మిశ్రమం ఆమ్లెట్లా మారుతుంది. పరాటాని పై నుంచి గట్టిగా నొక్కితే ఆమ్లెట్ దానికి అతుక్కుంటుంది. బాగా కాల్చాక తీసి ప్లేటులో వేసుకోవాలి. దీనికి ఏ చట్నీ లేకపోయినా టేస్టీగా ఉంటుంది.  టమాటో సాస్ లేదా పుదీనా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. 


Also read: ఇలా రాగిదోశ చేస్తే వదిలిపెట్టకుండా తినేస్తారు, అధిక బరువు నుంచి మధుమేహం వరకు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు



Also read: ఇలా మామిడికాయ పొడి చేసుకుంటే, చింతపండు అవసరం ఉండదు, మధుమేహులకు ఎంతో మేలు