దొండకాయలు, వంకాయలకు అభిమానులు తక్కువగా ఉంటారు. అందులోనూ దొండకాయలతో చేసే వంటకాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినేవారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దొండకాయలు తినడం వల్ల పిల్లలకు సరిగా మాటలు రావని, మందబుద్ధులుగా మారుతారని అపోహ ఒకటి ప్రజల్లో ఉంది. దీనివల్ల పిల్లలకు దొండకాయలు ఎవరూ తినిపించరు. నిజానికి దొండకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే దొండకాయలు తింటే నాలిక మందంగా మారుతుందని, దీనివల్ల మాటలు రావని చెప్పే అపోహకు శాస్త్రీయపరంగా ఎలాంటి నిరూపణలు జరగలేదు. దొండకాయలు తింటే బుద్ధి మందగిస్తుందని చెప్పే నిరూపణలు కూడా  ఎలాంటివి లేవు. కాబట్టి అందరూ దొండకాయలను హ్యాపీగా తినవచ్చు. పిల్లలకు కూడా పెట్టవచ్చు. దొండకాయలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఇద్దరికీ అవసరం.


దొండకాయలు తినడం వల్ల పిల్లల్లో మలబద్ధకం తగ్గుతుంది. చాలామంది పిల్లలు రోజూ మలవిసర్జన చేయరు. రెండు మూడు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటారు. దీనివల్ల వారికి సుఖ విరోచనం అవ్వదు. ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకు దొండకాయలు తినిపించడం వల్ల సుఖ విరేచనం అవుతుంది. వీటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చర్మానికి మెరుపు కూడా వస్తుంది. ముఖ్యంగా దొండకాయలు అన్ని సీజన్లలో లభిస్తాయి. కాబట్టి అన్ని సీజన్లలో వచ్చే వ్యాధుల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. కాబట్టి అన్ని కాలాలలోనూ దొండకాయను వారానికి ఒకటి నుంచి రెండుసార్లు తినడం ఎంతో ఉత్తమం. దొండకాయల జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే జ్యూస్ ని తీయడం చాలా కష్టం, కాబట్టి దొండకాయను తినేయడమే మంచిది. పచ్చి దొండకాయను కూడా చాలామంది తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల పేగులు, జీర్ణాశయంలో ఉండే వ్యర్ధాలు బయటికి పోతాయి. గ్యాస్ సమస్యలు, మంట వంటివి తగ్గుతాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు దొండకాయను అధికంగా తినాలి. దీనిలో ఉండే ఐరన్... రక్తం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.


దొండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్‌తో ఇది పోరాడుతాయి. కాబట్టి దొండకాయలను పిల్లలు, పెద్దలు ఇద్దరూ కచ్చితంగా తినాలి. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు దొండకాయలతో చేసే ఆహారాన్ని తింటే మంచిది. ఇవి ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా దొండకాయల్లోని సుగుణాలు కాపాడతాయి. ప్రతి అవయవానికి రక్త సరఫరా మెరుగ్గా జరిగేలా చేస్తాయి. శరీరంలో ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్లు వంటివి రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వారానికి కనీసం రెండుసార్లు దొండకాయలు తినడం వల్ల అంతా మంచే జరుగుతుంది . 


Also read: నీళ్లు తాగితే ఎంతో మంచిది, కానీ ఈ మూడు సందర్భాల్లో మాత్రం తాగకండి

































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.