మన శరీరానికి తగినంత ఆహారం, నీరు అందితేనే  సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాము. నిజానికి ఆహారం కన్నా నీరు చాలా ముఖ్యం. నీరు సరిగా అందకపోతే జీవక్రియల నిర్వహణలో ఎన్నో మార్పులు వస్తాయి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నీటిని దూరం పెట్టాలి. లేకుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏ ఏ సందర్భాల్లో నీటిని దూరం పెట్టాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.


చాలామంది నిద్రపోయే ముందు నీళ్లు తాగేసి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల రాత్రంతా దాహం వేయదని అనుకుంటారు. కానీ నిద్రించే ముందు ఎక్కువ నీరు తాగడం మంచిది కాదు. దాహంగా అనిపిస్తే కొంచెం మీరు మాత్రమే తాగాలి. లేకుంటే రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రాభంగం కలుగుతుంది. అంతేకాదు రాత్రి నిద్రపోయాక మూత్రపిండాల పనితీరు చాలా మందగిస్తుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా ఉంటే మూత్రపిండాలు రాత్రిపూట సరిగా పనిచేయలేక ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంది. 
 
ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య అధికంగానే ఉంది. వ్యాయామం చేసేటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువవుతుంది. ఈ సమయంలో చాలామంది నీరు అధికంగా తాగుతారు. వ్యాయామం చేసేటప్పుడు నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలో హఠాత్తుగా మార్పులు వచ్చేస్తాయి. ఇవి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. కనుక వ్యాయామం చేశాక 20 నిమిషాల పాటు నీళ్లు తాగకపోవడమే మంచిది. శరీర ఉష్ణోగ్రత సహజంగానే తగ్గుతూ ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గాక నీళ్లు తాగితే ఉత్తమం.


ఆహారం తీసుకునే సమయంలో కూడా చాలామంది ఎక్కువ నీళ్లు తాగేస్తూ ఉంటారు. ఇలా నీళ్లు తాగడం వల్ల శరీరానికి సరిపడా ఆహారం తీసుకోలేరు. ఆహారం తినడానికి అరగంట ముందు, ఆహారం తిన్న అరగంట తర్వాత... నీళ్లు తాగకపోవడమే మంచిది. ఆహారం తింటున్నప్పుడు నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుంది. పేగుల పనితీరు మందగిస్తుంది. కాబట్టి ఆహారం తింటున్న మధ్యలో, ఆహారానికి తినడానికి అరగంట ముందు, తిన్న అరగంట తర్వాత ఎలాంటి నీటిని తాగకపోవడమే ఉత్తమం.


శరీరానికి ఎంత అవసరమో అంత నీటిని మాత్రమే తాగాలి. అతిగా తాగితే శరీరంలో నీటి నిల్వలు పెరిగిపోతాయి. మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. జీర్ణ సంబంధ వ్యాధులు రావచ్చు. పొట్ట ఉబ్బరం వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.


Also read: డిస్పోజబుల్ కప్పుల్లో నీరు, టీ, కాఫీలు తాగడం మానేయండి - క్యాన్సర్ ముప్పు ఎక్కువ






Also read: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.