మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినా, తెలుగులో ‘సీతారామం’ అనే ఒకేఒక్క చిత్రం ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. దీంతో బాలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్‌లో కూడా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌ నుంచి కూడా పిలుపు వచ్చిందట.


ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లుగా కొనసాగుతున్నా.. ఒక్క సరైన హిట్ లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఒకేఒక్క బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నటీనటుల కెరీర్‌ను ఎన్నో మలుపులు తిప్పగలదు. వారికి కొత్త ఆఫర్లను అందించగలదు. వారిని స్టార్లను చేయగలదు. మృణాల్ ఠాకూర్ జీవితంలో అలాంటి ఒక సినిమానే ‘సీతారామం’. ముందుగా మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్.. ఆ తర్వాత సీరియల్స్‌లో అవకాశాలు దక్కించుకుంది. కొన్ని సీరియల్స్‌లో నటించిన తర్వాత వెండితెరపై కనిపించే అవకాశం తనకు లభించింది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై పలు సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా తనకు అక్కడ తగినంత గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపును అందజేసింది ‘సీతారామం’.


తెలుగు ప్రాజెక్ట్స్‌తో బిజీ..
‘సీతారామం’ కేవలం తెలుగులో మాత్రమే కాదు.. పాన్ ఇండియా చిత్రంగా పలు ఇతర భాషల్లో కూడా విడుదలయ్యింది. విడుదలయిన ప్రతీ భాషలో ఈ మూవీ హిట్టే. అలా ఒక తెలుగు సినిమా.. ఈ బాలీవుడ్ హీరోయిన్ రేంజే మార్చేసింది. అంతే కాకుండా అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులు అంతా తనను పక్కింటి అమ్మాయిగా చూడడం మొదలుపెట్టారు. ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం తెలుగులో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న వీడీ 13వ చిత్రంలో కూడా మృణాలే హీరోయిన్. విజయ్ దేవరకొండతో సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా.. ‘హాయ్ నాన్న’ నుంచి మాత్రం ఇప్పటికే ఒక గ్లింప్స్ విడుదలయ్యింది. ఇందులో మృణాల్ మరోసారి అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా వెలిగిపోనుందని గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది.


స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్‌తో..
తెలుగులో ఇలా పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్న మృణాల్‌కు కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. తమిళ హీరో శివకార్తికేయన్ తరువాతి చిత్రంలో మృణాలే హీరోయిన్ అని తెలుస్తోంది. ఇప్పటికే శివకార్తికేయన్ చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉండగా.. ఇవన్నీ పూర్తయిన తర్వాత స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో ఈ హీరో చేతులు కలపనున్నాడు. ఇందులో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేయడానికి మృణాల్‌ను ఎంపిక చేశారు మేకర్స్. ఇప్పటికే దానికి కావాల్సిన లుక్ టెస్ట్ కూడా పూర్తయ్యిందట. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఖరారు అయ్యాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం కాబట్టి.. కచ్చితంగా ఈ మూవీ భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి శివకార్తికేయన్ లాంటి హీరో, మురుగదాస్ లాంటి దర్శకుడితో కలిసి నటించే అవకాశాన్ని మృణాల్ తన మొదటి చిత్రంతోనే కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.


Also Read: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా - అబ్బాయి పేరేంటో తెలుసా? ఫోటో చూశారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial