Coconut Malai: కొబ్బరి నీళ్లను తాగమని వైద్యులు సూచిస్తుంటారు. వాటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కొబ్బరి మీగడను తినడం వల్ల కూడా రెట్టింపు మేలు జరిగే అవకాశం ఉంది. కొబ్బరి మీగడ అనగానే ఏదో అనుకోకండి, కొబ్బరినీళ్లు తాగాక అడుగున మిగిలే లేత కొబ్బరి గుజ్జుని కొబ్బరి మలై అంటారు. ఇది ఐస్ క్రీమ్‌లా మెత్తగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. లేత కొబ్బరికాయల్లో ఇది లభిస్తుంది. కొబ్బరికాయలు ముదిరిపోతే... ముదురు కొబ్బరి ముక్కలు దొరుకుతాయి. కాబట్టి లేత కొబ్బరి బొండాన్ని తాగి ఆ కొబ్బరిబోండాను రెండుగా చీల్చితే లోపల కొబ్బరి మలై ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, రాగి, మాంగనీస్, ఖనిజాలు, విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే రాగి ఎముకల అభివృద్ధికి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇక మాంగనీస్ కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకొని జీర్ణం అయ్యేలా చేస్తుంది.
కొబ్బరిమలైలో కొబ్బరి నూనె కూడా ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ కొబ్బరి గుజ్జులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ లభిస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పేగుల ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. దీనిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే పీచు, పిండి పదార్థాలను చక్కెరగా మారకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
కొబ్బరిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, మాంగనీస్‌లు రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఈ కొబ్బరి గుజ్జును తినడం వల్ల గ్లూకోజ్‌కు ప్రత్యామ్నాయంగా చైన్ మీడియం ట్రైగ్లిజరైడ్స్ ఏర్పడతాయి. ఇవి జ్ఞాపకశక్తి కోల్పోయిన వారికి ఎంతో సహాయపడతాయి. అంటే అల్జీమర్స్ సమస్య బారిన పడినవారు ఈ కొప్పరిగుజ్జును తింటే ఆ సమస్య త్వరగా తగ్గుతుంది. కొబ్బరి గుజ్జును మితంగా తీసుకుంటే శరీరం బరువు తగ్గే అవకాశం ఉంది. అధికంగా తీసుకుంటే మాత్రం బరువు పెరిగిపోతారు. ఇది తిన్నాక ఎక్కువ సమయం పాటు పొట్ట నిండిన భావన ఉంటుంది. కాబట్టి ఇతర ఆహారాలేవీ తీసుకోరు. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ మధ్య అసమతుల్యత ఏర్పడితే అది ఆక్సీకరణ ఒత్తిడికి కారణం అవుతుంది. ఈ కొబ్బరిమలై ఫినాలెక్ సమ్మేళనాలతో నిండి ఉంటుంది. ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఈ కొబ్బరి గుజ్జును తినడం వల్ల శరీరం పై శీతలీ కరణ ప్రభావం పడుతుంది. ఎండ బారిన పడినవారు కొబ్బరి నీటితో పాటు ఈ కొబ్బరి మలైన కూడా తినాలి. ఇది తక్షణ శక్తిని అందించి నీరసం లేకుండా చేస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
Also read: నా భార్య తనకి కావలసినప్పుడు మాత్రమే నాకు దగ్గరవుతోంది, నా ఆసక్తి పట్టించుకోవడం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.