ప్రశ్న: మాది పెద్దల కుదుర్చిన వివాహం. పెళ్లయి రెండేళ్లు అవుతోంది. నా భార్య చాలా వింతగా ప్రవర్తిస్తోంది. ఆమెకు ఆసక్తి అనిపించినప్పుడు మాత్రమే లైంగికంగా నాకు దగ్గరవుతుంది. నాకు నేనుగా ఆమె దగ్గరకు వెళితే మాత్రం అయిష్టత చూపిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, కనుక ఆమెను గట్టిగా ఏమీ అనలేను. బాధపడుతుందేమో అని భయం. అలాగే ఇలాంటి విషయాలు పెద్దవారితో చెప్పలేను. ఆమె తన అవసరానికి మాత్రమే నా దగ్గరకు రావడం, నా అవసరం పట్టించుకోకపోవడం నాకు ఎంతో బాధిస్తోంది. ఇలా రెండేళ్లుగా నేను మనోవ్యథ అనుభవిస్తున్నాను. ఆమెతో ఈ విషయాన్ని ఎలా మాట్లాడాలో దయచేసి చెప్పండి.


జవాబు: భార్యాభర్తల బంధంలో లైంగిక జీవితం చాలా ముఖ్యం. అదే వారిద్దరిని చాలా దగ్గర చేస్తుంది. ఆ సంబంధం సరిగా లేకపోతే ఆ భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. లైంగిక సంబంధం ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ భార్యాభర్తలు అంత సంతోషంగా ఉంటారని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మీ జీవిత భాగస్వామి తన ఆసక్తిని మాత్రమే ఎందుకు పట్టించుకుంటుందో, మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆమె ఒత్తిడికి గురవుతుందేమో తెలుసుకోండి, హార్మోన్లలో మార్పులు కూడా లైంగిక ఆసక్తిని చంపేస్తాయి. అలాంటి సమస్యలు ఆమెకి ఉన్నాయేమో ఓసారి కనుక్కోండి. మానసిక ఆందోళనలు వంటివి కూడా సాన్నిహిత్యాన్ని నాశనం చేస్తాయి. ఇలాంటి అంతర్లీన కారణాలు లైంగిక అనాసక్తికి కారణం కావచ్చు.


లైంగిక జీవితం పట్ల మీరంతా అసంతృప్తిగా ఉన్నారో ఆమెతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలా మాట్లాడితేనే ఆమె సమస్యలు కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మీ లైంగిక అవసరాలు, కోరికలను ఆమెకు స్పష్టంగా వ్యక్తం చేయండి. ఆమెకు నచ్చినప్పుడు మీ దగ్గరకు ఎలా వస్తుందో, అలా మీకు కూడా సొంత ఆసక్తులు, ఇష్టాలు ఉంటాయని తెలియచెప్పండి. అంతేకాదు మీ ఇద్దరి జీవితం సంతోషంగా సాగాలంటే సంతృప్తికరమైన లైంగిక జీవితం అవసరమని ఆమెకి అర్థం అయ్యేలా చెప్పండి. ఎలాంటి మానసిక సమస్యల్లో ఆమె ఉన్నా అందుకు మీరు మద్దతుగా ఉంటారని వివరించండి. అవసరమైతే వైద్యుల వద్దకు కూడా వెళ్లడానికి సిద్ధమవ్వండి. ముఖ్యంగా మానసిక నిపుణులు ఇలాంటి సమస్యలకు కారణాలను కౌన్సెలింగ్ ద్వారా కనిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ భార్యతో ఓపెన్ గా మాట్లాడడం మంచిది. వివాహం పూర్తయ్యేది సంతృప్తికర లైంగిక జీవితంతోనే ఆ విషయాన్ని ఆమెకు తెలియజేయండి. మీ అసంతృప్తి తారాస్థాయికి చేరితే మీ ఇద్దరి వివాహ బంధానికి బీటలు వారడం చాలా సులువు. అంతవరకు తెచ్చుకోకుండా సైక్రియాటిస్టుల హెల్ప్ సాయం కూడా తీసుకోండి. మొదట మీ ఇద్దరు కూర్చుని ఈ విషయంపై చర్చించడం చాలా అవసరం. 



Also read: వంద కోట్ల గుడ్లలో ఒక గుడ్డు మాత్రమే ఇలా ఉంటుంది, దీని ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు





















































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.