బరువు తగ్గడం కోసం తిండి మానేస్తారు చాలామంది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, కొత్త రోగాలు వచ్చి పడతాయి. బరువు తగ్గాలంటే వ్యాయామానికి మించిన మంచి ఆప్షన్ ఏదీ లేదు. అలాగే, మనం తినే ఆహారం కూడా బరువు తగ్గేందుకు సహకరిస్తుందని తెలుసా? ముఖ్యంగా బాదం పప్పులు తినడం వల్ల ఆరోగ్యంతోపాటు బరువు కూడా తగ్గుతారట. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే చూడండి.
కార్బోహైడ్రేట్ల వల్ల బరువు పెరుగుతారనేది నిర్వివాద అంశం. అయితే కార్బోహైడ్రేట్‌తో తప్ప కడుపు నిండిన భావన కలగదు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు తిండి విషయంలో రకరకాల కష్టాలు పడుతుంటారు. భోజనం కాస్త పర్వాలేదు కానీ స్నాకింగ్ అయితే చాలా ఇబ్బంది. అధ్యయనాలు ఇప్పుడు ఒక హెల్తీ స్నాకింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ అధ్యయనంలో కార్బోహైడ్రేట్లకు బదులుగా బదాంలను స్నాకింగ్ కు ఉపయోగించుకున్నపుడు రోజులో వాడే కాలరీ ఇన్ టేక్ 72 కెలోరీలు వరకు తగ్గినట్టు గమనించారు. ప్రస్తుతం అధిక బరువు, స్థూలకాయం ప్రపంచానికి సవాళ్లు విసురుతున్నాయి. దీనిని సరిచేసే క్రమంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ల ప్రతిస్పందన అనేది ముఖ్యమైన అంశమని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ షరయా కర్టార్ అంటున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పరిశోధనల్లో ఆకలిని నియంత్రించే హార్మోన్లను డ్రై ఫ్రూట్స్‌లో కనుగొన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా బాదం పప్పులు ఏ విధంగా ఆకలిపై ప్రభావం చూపుతాయో తెలుసుకొనే ప్రయత్నం చేశారు. రోజూ క్రమం తప్పకుండా బాదంలు తీసుకునే వారిలో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులను గమనించారు. హార్మోన్ల పనితీరులో మార్పుల వల్ల ఆకలి తగ్గిందని, అందువల్ల ఫూడ్ ఇన్ టేక్ గణనీయంగా తగ్గిందని ఈ పరిశోధకులు అంటున్నారు.
బాదంతో కలిగే లాభాలు
- బాదంతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. బాదంలో ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు, పీచు పదార్థం ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులకు మంచి స్నాక్.
- వంద గ్రాముల బాదంతో 571 కిలో కేలరీల శక్తి అందుతుంది. వీటిలో ప్రొటీన్ 21.43 గ్రాములు, కార్బోహైడ్రేడ్ 21.43 గ్రాములు, పీచు పదార్థాలు 10.7 గ్రాములు, కొవ్వు 50 గ్రాములు ఇవే కాకుండా ఇంకా అనేక సూక్ష్మపోషకాల కూడా ఉంటాయి.
- బాదం పప్పులు క్రమం తప్పకుండా తీసుకున్నపుడు మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
- బాదంలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో అవసరం. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.
- క్యాన్సర్ పేషెంట్లకు కూడా బాదం చాలా మంచి బలవర్థకమైన ఆహారం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం కనుక శరీరంలో జరిగే ఆక్సిడేషన్ ప్రక్రియను నియంత్రిస్తాయి.
- 12 వారాల పాటు బాదం క్రమం తప్పకుండా వినియోగించిన టైప్ 2 డయాబెటిక్ పేషెంట్లలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం మాత్రమే కాదు ఆక్సిడేషన్ ప్రక్రియ కూడా నెమ్మదించడాన్ని ఒక క్లీనికల్ అధ్యయనంలో గమనించారు.
- ప్రతి రోజు 50 గ్రాముల బాదం తింటే బరువు తగ్గడం, నడుము చుట్టు కొలత తగ్గడం, కొలెస్ట్రాల్ తగ్గడం వంటి మార్పులను గమనించారు.
మోతాదు మించితే
- 50 గ్రాములకు మించి ఒక రోజులో బాదం పప్పులు తీసుకుంటే మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పికి కారణం కావచ్చు.
- 100 గ్రాములకు మించి బాదం పప్పులు తీసుకుంటే డయేరియా, తలతిరగడం, కంటి చూపులో తాత్కాలిక మార్పు రావచ్చు.
- బాదంలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది కనుక మోతాదుకు మించి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు.
- ఆక్సలేట్ శరీరం కాల్షియం గ్రహించడాన్ని నియంత్రిస్తుంది. అందువల్ల ఈ సమస్య వస్తుంది. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్న వారు బాదం తీసుకోవడంలో నియంత్రణ తప్పక పాటించాలి.
Also read: గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ ఎందుకు అత్యవసరం? ఫోలిక్ యాసిడ్ తగ్గితే ఏమవుతుంది?