Gujarat Elections 2022:
భవిష్యత్ గురించి ఆలోచించండి: కేజ్రీవాల్
"ఈ సారి కాస్త కొత్తగా ఆలోచించండి" అని గుజరాత్ ఓటర్లకు సూచించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ప్రస్తుతం రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగానే.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ సారి కాస్త కొత్తదనమైన తీర్పునివ్వండి" అంటూ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ సారి ఎలాగైనా గుజరాత్‌లో తమ ఉనికిని బల పరుచుకోవాలని గట్టి సంకల్పంతో ఉంది ఆప్. బీజేపీ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా ముందే ప్రచారాన్ని మొదలు పెట్టింది. క్రమక్రమంగా జోరు పెంచింది. స్వయంగా కేజ్రీవాల్ రాష్ట్రానికి వచ్చి అన్ని ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. "రెండో విడత పోలింగ్‌లో 93 సీట్లకు గానూ ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. ఈ ఎన్నికలు గుజరాత్ ప్రజలకు కొత్త ఆశాకిరణం లాంటిది. దశాబ్దాల తరవాత దొరికిన అరుదైన అవకాశమిది. భవిష్యత్ గురించిఆలోచించండి. గుజరాత్ పురోగతికి తోడ్పడండి. ఈ సారి మునుపటి కన్నా కొత్తగా తీర్పునివ్వండి" అని ట్వీట్ చేశారు. సెంట్రల్, నార్త్ గుజరాత్‌లోని నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 833 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 182 నియోజకవర్గాలున్న గుజరాత్‌లో 93 స్థానాల్లో పోటీ చేసింది ఆప్. గత ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగినా..అధికారం కోల్పోయింది కాంగ్రెస్. ఈ సారి 90 సీట్లలో పోటీ చేసింది.
ప్రశాంతంగా పోలింగ్..
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 89 స్థానాలకు డిసెంబర్ 1న తొలి విడత పోలింగ్ జరిగింది. మిగిలిన 93 స్థానాలకు నేడు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో భాజపా, ఆప్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల ఒకటిన 89 స్థానాలకు పోలింగ్ జరగగా.. 63.34 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే 3 శాతానికిపైగా ఓటింగ్ శాతం తగ్గింది.రెండో విడత పోలింగ్ జరుగనున్న 93 స్థానాలకుగాను అన్నిపార్టీల తరఫున 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో 2.54 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వారికోసం 26,409 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాణిప్‌లోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో మోదీ ఓటు వేశారు.
" ప్రజాస్వామ్య పండుగను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, దిల్లీ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. దేశ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. "
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: Senegal Parliament Video: పార్లమెంటులో సభ్యుల మధ్య ఘర్షణ- మహిళా ఎంపీపై దాడి!