Hyderabad Landmarks To Go Dark On March 23: వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహణ కల్పించేందుకు నిర్వహించే కార్యక్రమం ఎర్త్ అవర్. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) సంస్థ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా మార్చి 23న రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్‌ పాటించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఎర్త్ అవర్ సమయంలో వ్యక్తులు, వ్యవస్థలు  కలిసి గంట పాటు లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆఫ్ చేయాలని కోరింది.


ఆస్ట్రేలియాలో మొదలు..


ఎవర్ అవర్ అనే కార్యక్రమం 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభం అయ్యింది. సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ ఈవెంట్ గా దీన్ని మొదలు పెట్టారు. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిలియన్ల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. గంటపాటు తమ ఇళ్లు, కార్యాలయాల్లోని లైట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫ్ చేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో పర్యావరణంపై ప్రజలకు మేలు కల్పించడం కోసమే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.


హైదరాబాద్ లో చీకటిమయం కానున్న ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌ లు ఇవే!


ఎర్త్ అవర్ సందర్భంగా వెలుగుల నగరం హైదరాబాద్ కూడా చీకటిమయం కానుంది. పలు ఐకానిక్ ల్యాండ్ మార్క్ ల దగ్గర లైట్లు ఆర్పివేయనున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, బిఆర్ అంబేద్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, తెలంగాణ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఐకానిక్ చార్మినార్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద శనివారం నాడు గంట పాటు లైట్లు ఆఫ్ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


ఢిల్లీ గంట పాటు ఎర్త్ అవర్ పాటించాలని పవర్ డిస్కమ్‌ ల పిలుపు     


హైదరాబాద్‌తో పాటు, దేశ రాజధాని ఢిల్లీలోని పవర్ డిస్కమ్‌లు కూడా ఎర్త్ అవర్ విషయంలో కీలక విజ్ఞప్తి చేసింది. మార్చి 23న ఒక గంట పాటు అనవసరమైన లైట్లు, విద్యుత్ ఉపకరణాలను స్విచ్ ఆఫ్ చేయమని వినియోగదారులను కోరింది. గత సంవత్సరం, ఎర్త్ అవర్ కారణంగా ఢిల్లీ 279 మెగావాట్లను ఆదా చేసిందని వెల్లడించింది.  అటు బాంబే సబర్బన్ ఎలక్ట్రిక్ సప్లై (BSES) సంస్థ కూడా తమ 50 లక్షల మంది వినియోగదారులను ఎర్త్ అవర్ పాటించాలని కోరింది.


ఎర్త్ అవర్ ప్రాముఖ్యతను వివరించడానికి డిస్కమ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లకు లేఖలు పంపుతున్నట్లు టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ సంస్థ తెలిపింది. పలు స్వచ్ఛంద సంస్థలు సైతం ఎర్త్ అవర్ లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఎర్త్ అవర్ ద్వారా కలిగే లాభాలను వివరిస్తూ ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నాయి. మొత్తంగా మార్చి 23న భారత్‌, లాస్‌ ఏంజెల్స్‌, లండన్‌, హాంకాంగ్‌, సిడ్నీ, రోమ్‌, మనీలా, సింగపూర్‌, దుబాయ్‌ సహా పలు దేశాల్లో కోట్లాది మంది ఎర్త్‌ అవర్‌ లో పాల్గొనున్నారు.  


Read Also: డ్రెస్​లు పాడవ్వకుండా.. హోలీ కలర్స్​ను వదిలించుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి