Sree Vishnu's Om Bheem Bush Review In Telugu: శ్రీవిష్ణు అండ్ కామెడీ... సూపర్ హిట్ కాంబినేషన్. లాస్ట్ ఇయర్ 'సామజవరగమన', అంతకు ముందు 'రాజరాజ చోర', 'బ్రోచేవారెవరురా'... కామెడీతో కూడిన కథలు చేసిన ప్రతిసారీ ఆయనకు విజయాలు వచ్చాయి. ఆ సినిమాలు ప్రేక్షకులకు నవ్వులు పంచాయి. 'సామజవరగమన' విజయం తర్వాత శ్రీవిష్ణు హీరోగా నటించిన సినిమా 'ఓం భీమ్ బుష్'. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్ సంస్థతో కలిసి సురేష్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ (Om Bheem Bush Story): క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మ్యాడీ (రాహుల్ రామకృష్ణ)... ముగ్గురూ స్నేహితులు. పీహెచ్‌డీ పేరుతో ఓ కాలేజీలో చేరతారు. ఐదేళ్లు అయినా పూర్తి చేయరు. కాలేజీలో వాళ్లు చేసే పనులు చూడలేక, వాళ్లతో వేగలేక ఏకంగా ప్రిన్సిపాల్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్) పరీక్షలు రాసి వాళ్లను బయటకు పంపిస్తాడు. వినయ్ ఊరు వెళుతూ మధ్యలో భైరవపురంలో బండిని ఆపాల్సి వస్తుంది.
భైరవపురంలో తాంత్రిక విద్యల పేరుతో కొందరు డబ్బు సంపాదించడం బ్యాంగ్ బ్రోస్ కంట పడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నిక్స్ ప్రజలకు చూపించి తాము డబ్బు సంపాదించాలని రంగంలోకి దిగుతారు. తక్కువ సమయంలో ఊరి ప్రజల్లో ఎక్కువ అభిమానం సొంతం చేసుకుంటారు. నిజంగా ఆత్మలను పట్టి బంధించగల, గుప్త నిధులు కనిపెట్టగల శక్తి సామర్థ్యాలు ఉంటే... ఊరి చివర మహల్ లో సంపంగి దెయ్యాన్ని బ్యాంగ్ బ్రోస్ పట్టుకోవాలని, అందులో నిధులు తీసుకు రావాలని సవాల్ విసురుతాడు అప్పటి వరకు తాంత్రిక విద్యలతో డబ్బు సంపాదించిన మాంత్రికుడు.
సవాల్ స్వీకరించిన క్రిష్ మూడు కండిషన్స్ పెడతాడు. అవి ఏమిటి? సర్పంచ్ కుమార్తె జలజ... జలజాక్షి (ప్రీతి ముకుందన్)తో అతని ప్రేమకథ ఏమిటి? మహల్ లో అడుగుపెట్టిన ముగ్గుర్నీ సంపంగి దెయ్యం ఏం చేసింది? అసలు సంపంగి దెయ్యం నేపథ్యం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Om Bheem Bush Review): నో లాజిక్స్, ఓన్లీ మేజిక్... 'ఓం భీమ్ బుష్'కు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి ఇచ్చిన క్యాప్షన్. అందుకు తగ్గట్టు నిజంగా స్క్రీన్ మీద మేజిక్ చేశారు. కథతో సంబంధం లేకుండా కామెడీతో నవ్వించారు. అలాగని, కథ లేదని కాదు... ఉంది. కానీ, కథను కామెడీ డామినేట్ చేసింది. కథ అంటే కామెడీ ఎక్కువ హైలైట్ అయ్యింది.
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు. వాళ్లకు టైలర్ మేడ్ అన్నట్లు దర్శకుడు శ్రీహర్ష డైలాగులు, సీన్లు రాశారు. ఫస్టాఫ్‌లో కాలేజీ ఎపిసోడ్, మెయిన్ లీడ్స్ ముగ్గురి మధ్య సన్నివేశాలు, ఊరిలోకి ఎంటరైన తర్వాత ముగ్గురూ చేసే హంగామా నవ్విస్తాయి. ఇంటర్వెల్ తర్వాత ఘోస్ట్ ఎపిసోడ్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ & సంపంగి దెయ్యం మధ్య సన్నివేశాలు... సంపంగి దెయ్యం గురించి శ్రీవిష్ణు అసలు నిజం తెలుసుకునే సన్నివేశం ప్రతి ఒక్కర్నీ నవ్విస్తాయి.
లాజిక్ పక్కనపెట్టినా... క్లైమాక్స్‌లో మేజిక్ వర్కవుట్ కాలేదు. ఒక్కసారిగా కథలో వచ్చిన టర్న్స్, ట్విస్టులతో పాటు శ్రీవిష్ణు క్యారెక్టర్ మారిన తీరును యాక్సెప్ట్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో కథలో లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నారు. ఫస్టాఫ్ రోలర్ కోస్టర్ రైడ్ కింద ఉంటుంది. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ క్యారెక్టర్లు అలంకారప్రాయంగా మారాయి. శ్రీవిష్ణు లాస్ట్ ఫిల్మ్ 'సామజవరగమన'లో పోలిస్తే... ఇందులో కొన్ని డైలాగుల్లో డోస్ పెరిగిందని చెప్పాలి. ప్రేక్షకుల టికెట్ రేటుకు సరిపడా కామెడీని ఫుల్లుగా అందించింది. మధ్య మధ్యలో నవ్వులకు చిన్న చిన్న బ్రేక్స్ పడతాయి. అయితే... మేజిక్ పక్కనపెట్టి లాజిక్ ఆలోచిస్తే నవ్వుకోవడం కష్టం.
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మధ్య కామెడీ కెమిస్ట్రీ మరోసారి చక్కగా కుదిరింది. బ్యాంగ్ బ్రోస్ బాగా చేశారు. హీరోయిన్లకు ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్‌లకు ఎక్కువ స్క్రీన్ స్పేస్, సీన్లు లభించలేదు. ప్రియా వడ్లమాని ప్రత్యేక గీతంలో సందడి చేశారు. కామాక్షీ భాస్కర్ల ఓ సన్నివేశంలో కనిపించారు. శ్రీకాంత్ అయ్యంగార్, 'రచ్చ' రవి నవ్వించారు.
రాజ్ తోట సినిమాటోగ్రఫీ 'ఓం భీమ్ బుష్'కు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రతి ఫ్రేమ్ బావుంది. నిర్మాతలు సైతం ఖర్చుకు వెనుకాడలేదు. కాలేజీ ఎపిసోడ్స్, మహల్ సీన్స్... ప్రతి సన్నివేశంలో రిచ్ నెస్ కనిపించింది. సన్నీ ఎంఆర్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు కొత్త ఫీల్ తెచ్చాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే రెండు స్పెషల్ సాంగ్స్ పెప్పీగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత సాంగ్ సైతం బావుంది.
నో లాజిక్స్... ఓన్లీ లాఫింగ్స్... థియేటర్లలో చక్కగా కూర్చుని రెండున్నర గంటలు హాయిగా నవ్వుకోవడానికి 'ఓం భీమ్ బుష్' బెస్ట్ ఆప్షన్. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ... ముగ్గురూ మరోసారి మేజిక్ చేశారు. హ్యాపీగా సినిమాకు వెళ్లవచ్చు. మాసెస్ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు.