ఒక్కోరోజు ఆఫీసులో పనులు చాలా త్వరత్వరగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి ఎంత కష్టపడినా పని ముందుకు సాగినట్లు ఉంటుంది. ఇలా మనకే జరుగుతుందా? లేదా అందరికీ ఇలాగే ఉంటుందా? అనే సందేహం చాలామందిలో కదులుతుంది. ఆఫీసుల్లో పని చేసే వారిలో ప్రతి పది మందిలో ఆరుగురికి ఇలా జరుగుతూనే ఉంటుందని.. పరిశోధకులు ఆధారాలతో సహా చెబుతున్నారు. ఇందుకు కారణం బ్రెయిన్ డ్రెయిన్ అవటమేనట. రోజులో ఏ సమయంలో పని చురుకుగా సాగుతుంది? ఏ సమయంలో మందకోడిగా సాగుతుంది? అనే అంశాల గురించి నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి.
ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులు ఉదయం 10.22 గంటల సమయంలో చాలా చురుకుగా.. మంచి ప్రొడక్టివిటి సామర్థ్యం కలిగి ఉంటారట. కుమధ్యాహ్నం 1.27 గంటల సమయంలో చాలా మందకోడిగా ఉంటారట. ఇక సమయం 2.06 గంటలకు చేరే టైమ్‌కు మరింత నెమ్మదిగా పనిచేస్తారట. ప్రతి పది మంది ఉద్యోగుల్లో ఆరుగురు ఇలాగే ఉంటారని సర్వే చెబుతోంది. ఈ సమయంలో పని సరిగ్గా చేయడానికి చాలా కష్టపడతారట.
కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం, సహోద్యోగులు తరచుగా అంతరాయం కలిగించడం, తగినంత విరామం దొరక్కపోవడం వంటి కారణాల వల్ల కూడా పనికి అంతరాయం కలుగుతున్నట్లు సర్వే నిర్వాహకులు వెల్లడించారు. ‘రెంటల్ ఏజెన్సీ ఆఫీస్ ప్రీడం’ అనే సంస్థ దాదాపు 2000 మంది ఉద్యోగుల నుంచి ఓటింగ్ తీసుకుని ఈ సర్వే నిర్వహించింది.
ఇంటి నుంచి పని చెయ్యడం కంటే ఆపీసులో పనిచెయ్యడంలోనే ఫన్ ఉందని సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. పని విధానం, ప్రొడక్టివిటి కూడా ఆఫీసులోనే మెరుగ్గా ఉందని అన్నారట. అయితే, పరిసరాల్లో వినిపించే శబ్ధాలు, గదిలోని ఉష్ణోగ్రత, సహోద్యోగుల కలిగించే అంతరాయం, లేదా మాటలు, లేదా అనుమాన నివృత్తులు వంటివన్నీ కూడా కాలయాపనకు కారణాలు అవుతున్నాయట. సాధారణంగా వీక్ స్టార్టింగ్ లో ఉద్యోగులు ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తారట. వారం గడిచే కొద్దీ నెమ్మదిగా ఉత్సాహం సన్నగిల్లుతుందట. వీకెండ్స్‌లో ప్రొడక్టివిటీ తగ్గడానికి కారణం ఇదేనట.
ఉద్యోగులు ఒక వర్కింగ్ డేలో దాదాపు మూడు సార్లు అలసటగా ఉందనే కంప్లైంట్ చేస్తారు. ఆఫీసుల్లో పనితీరు మెరుగ్గా ఉండాలంటే.. ఉద్యోగులను సౌకర్యంగా ఉంచడం అవసరం అని సర్వే చెబుతోంది. పనులు చురుగ్గా సాగాలంటే అందుకు తగిన వాతావరణం ఆఫీసులో ఉండాలి. అంతేకాదు, తగినంత పని విరామం కూడా అవసరమేనట. కొంత మోటివేషన్, కొంత విరామం, మరికొంత ప్రోత్సాహంతో ప్రొడక్టివిటి పెంచవచ్చని ఈ సర్వేనిర్వాహకులు చెబుతున్నారు. కాబట్టి సంస్థలు ఉద్యోగుల నుంచి ఎక్కువ పని రాబట్టు కోవడానికి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమట.
Also read: టమోటో కెచప్ ఇంట్లోనే తాజాగా తయారు చేసుకోండి, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అవసరం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.