అల్లం ఎన్నో గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంది. ఎన్నో దశాబ్దాల నుంచి అల్లాన్ని ఆయుర్వేదంలో వాడుతున్నారు. ప్రతి వంటింట్లోనూ ఇది తప్పక ఉంటుంది. మసాలా కూరల దగ్గర నుంచి టీ వరకు అన్నింటిలోనూ తప్పకుండా అల్లాన్ని ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ మైక్రోబయల్ నిండి ఉంటుంది. వంటలకి రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కడుపులో గ్యాస్ ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా అల్లం ముక్క వేసుకుని నములుతారు. అలా చెయ్యడం వల్ల పొట్ట క్లీన్ అవుతుందని చెప్తారు.


అయితే తాజా అల్లం కంటే ఎండిన అల్లం పొడి(సొంటి) మరింత మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయని అంటున్నారు. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పుడు తాజా అల్లంతో చేసిన టీ తాగడం కంటే ఎండిన అల్లం పొడి(సొంటి) వేసుకుని నీటిని తాగడం వల్ల ఫ్లూ నుంచి త్వరగా కోలుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. తాజా అల్లం కంటే సొంటే అసలైన హీరో అని అంటున్నారు.


వాతం తగ్గిస్తుంది  


తాజా అల్లం వాతాన్ని పెంచుతుంది. అయితే ఎండిన అల్లం వాతాన్ని సమతుల్యం చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అందుకే గ్యాస్, పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడం కోసం తాజా అల్లం నమలడం లేదా తాజా అల్లం టీ తాగడానికి బదులుగా అల్లం పొడి వేసుకుని నీటిని తాగితే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు.


మలబద్ధకాన్ని నివారిస్తుంది


మలబద్ధకాన్ని నివారించడానికి అల్లం పొడి చాలా గొప్పగా పని చేస్తుంది. ఉదయం పూట నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు నీటిలో అల్లం పొడి కలుపుకుని తాగడం వల్ల పేగులు శుభ్ర పడతాయి. మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.


కఫం పోగొడుతుంది


తాజా అల్లం కఫాన్ని పెంచితే.. ఎండిన అల్లం (సొంటి) జలుబు వల్ల వచ్చే కఫాన్ని పోగొడుతుంది. అందుకే జలుబు, దగ్గు, ఫ్లూ కారణంగా శ్వాస కొస ఇబ్బందులు తలెత్తినప్పుడు అల్లం పొడి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. శ్వాసకోస రుగ్మతలు నయం చెయ్యడంలో గొప్పగా పని చేస్తుంది.


అందుకే తాజా అల్లం కంటే ఎక్కువగా ఎండిన అల్లం పొడి వల్ల ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సొంటి వల్ల దీర్ఘకాలిక ఉపయోగాలు ఉంటాయి. ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అదే తాజా అల్లం అయితే కొద్ది రోజుల తర్వాత ఫంగస్ ఏర్పడి బూజు పట్టడం, కుళ్లిపోవడం వంటివి జరుగుతాయి. అదే అల్లం ఎండబెట్టి పొడి చేసుకుని ఉపయోగించుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు.


Also read: పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో నొప్పి రావడం సహజమేనా?


Also read: ఈ చిత్రంలో మీకు మొదట ఏ జీవి కనిపిస్తోంది? దాన్ని బట్టి మీ మెదడు ఏ వైపు చురుగ్గా పనిచేస్తుందో చెప్పవచ్చు