సైబరాబాద్ పోలీసులు భారీ అంతర్రాష్ట్ర క్రైమ్ ఆపరేషన్ ను విజయవంతంగా ఛేదించారు. రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు ఇన్వెస్ట్‌మెంట్ అంటూ యాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నిందితుల నుంచి దాదాపు రూ.10 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అభిషేక్ జైన్, పవన్ కుమార్ ప్రజాపత్, ఆకాశ్ రాజ్, శ్రీక్రిష్ణ కుమార్ గా గుర్తించారు. మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ కేంద్రాలుగా సైబర్ ముఠాలు పని చేస్తున్నాయని కమిషనర్ తెలిపారు. త్వరలోనే మరిన్ని దాడులు కూడా చేస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా నగదు రికవరీ చేసి రికార్డ్ క్రియేట్ చేశామని వెల్లడించారు.
హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి తొలుత ఈ యాప్ ద్వారా రూ.9,999 ఇన్వెస్ట్ చేశాడు. ఆ డబ్బులన్నీ కోల్పోయాడు. ఆ తర్వాత రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టగా, రూ.14.9 లక్షలు వచ్చింది. దీంతో అతడిలో ఆశ పెరిగింది. ఆ పెట్టుబడి పెట్టడం కంటిన్యూ చేశాడు. ఆశతో ఏకంగా రూ.62.6 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అలా చేయగా, అతనికి రూ.34.7 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే రూ.27.9 లక్షలు నష్టపోయాడు. దీంతో అతడికి జ్ఞానోదయం అయింది. ఇదంతా ఫ్రాడ్ అని తెలుసుకుని షాక్ అయ్యాడు. వెంటనే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్ గా తీసుకుని విచారణ చేశారు. ఇది అంతర్రాష్ట్ర వ్యవహారమని, మోసం యూపీ కేంద్రంగా జరుగుతోందని తెలుసుకొని ఆ దిశగా నిందితులను పట్టుకొనేందుకు ప్రణాళిక చేశారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన కమోడిటీ ట్రేడర్ అభిషేక్ జైన్ ను ముందుగా పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ బాక్స్ ట్రేడింగ్ యాప్ వెనుకున్న ప్రధాని సూత్రధారి ఇతనే అని కమిషనర్ తెలిపారు. మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ అప్లికేషన్ తో పాటు మార్కెట్ బాక్స్ పేరుతో అతను వెబ్ సైట్ డెవలప్ చేశాడు. ఆ యాప్ ను సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేశాడు. సెబీతో రిజిస్ట్రర్ అయిన మల్టీ కమాడిటీ ఎక్స్ చేంజ్ మాదిరే మార్కెట్ బాక్స్ యాప్ ను నిందితుడు డెవలప్ చేయడం చూసి పోలీసులు కంగుతిన్నారు. సుమారు 300 మంది ట్రేడర్లు ఈ నకిలీ యాప్ లో రిజిస్ట్రర్ అయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.