Drinking Water at Night is it Good or Bad : ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. అయితే శరీరానికి నీరు ఎంత అవసరమో.. దానిని ఏ సమయంలో తీసుకుంటున్నారనేది కూడా అంతే ముఖ్యం. అందుకే దీని గురించి తెలుసుకోవడం చాలాముఖ్యం. చాలా మంది రాత్రి నిద్రపోయే ముందు నీరు తాగితే రాత్రంతా హైడ్రేటెడ్‌గా ఉండవచ్చని నమ్ముతారు. మీరు కూడా అలానే అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు నీరు తాగితే లాభమా? నష్టమా? నిపుణులు ఇచ్చే సలహాలు ఇవే..

డీహైడ్రేషన్ 

నిద్రపోయే ముందు నీరు తాగితే డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, శరీరంలోని వ్యర్థాలను బయటకి పంపేందుకు, కీళ్ల నొప్పులను దూరం చేసేందుకు హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో, రాత్రిపూట చెమటలు పట్టే వారికి ఇది  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరాన్ని బాగా హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. అలాంటి సమయంలో ఇది మంచి నిద్రకు కూడా హెల్ప్ చేస్తుంది.

మూడ్‌స్వింగ్స్!?

తగినంత నీరు తాగడం వల్ల మూడ్ మెరుగుపడుతుంది. చిరాకు తగ్గుతుంది. ఒక అధ్యయనంలో.. నీరు ఎక్కువగా తీసుకున్న వ్యక్తుల్లో ఎమోషన్స్ కంట్రోల్లో ఉండడంతో పాటు.. ప్రశాంతంగా ఉంటున్నారని గుర్తించారు. రాత్రి నీరు తాగి పడుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందట. అలాగే ప్రశాంతమైన నిద్రకు సహాయపడుతుంది.

డీటాక్స్, ఇమ్యూనిటీ

నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే అది సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. చెమట ఉత్పత్తిని పెంచుతుంది. ఇది శరీరంలోని విషపూరిత పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అదనంగా నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను కలిపి తాగడం వల్ల రుచి పెరగడమే కాకుండా విటమిన్ సి కూడా పెరుగుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి.. ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.

నష్టాలు ఇవే..

మూత్ర విసర్జన : నిద్రపోయే ముందు నీరు తాగడం వల్ల రాత్రుళ్లు పదేపదే మూత్ర విసర్జన కోసం లేవాల్సి వస్తుంది. దీనివల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. నిద్ర నాణ్యతను గణనీయంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల మానసికంగా ఇబ్బంది పడడంతో పాటు.. శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. 

గుండె ఆరోగ్యంపై ప్రభావం : తరచుగా బాత్రూమ్‌కు వెళ్లడం, సరైన నిద్ర లేకపోవడం ఎక్కువకాలం కొనసాగితే గుండె ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం పడుతుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే నిద్రపోయే రెండు గంటల ముందు నుంచి నీరు తాగకపోవడమే మంచిదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మంచి నిద్ర, హైడ్రేషన్ సాధ్యమేనా?

రోజంతా హైడ్రేటడ్గా ఉండేందుకు నిద్రపోయే ముందు కాకుండా ప్రతి భోజనంతో పాటు ఓ గ్లాసు నీరు తాగాలి. పగలు మంచిగా నీరు తీసుకుంటే రాత్రుళ్లు కూడా శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి అధిక నీటి అవసరాన్ని తీర్చడంలో హెల్ప్ చేస్తాయి. సాయంత్రం కెఫిన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి దాహాన్ని పెంచి.. ఎక్కువనీరు తాగేలా చేస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.