భారతీయ సంస్కృతికి ప్రతీక టీ. ఇంటికి వచ్చిన అతిథులకి టీ ఇచ్చి మర్యాద చేయడం భారతీయుల సంప్రదాయం. కొంతమందికి పొద్దున్నే నిద్రలేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల కొంతవరకు ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ అతిగా టీ తాగితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని రకాల సీజన్లలో అందరూ ఇష్టంగా తాగే టీ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతే కాదు కాఫీతో పోల్చుకుంటే టీలో తక్కువ కెఫీన్ ఉంటుంది. నాది వ్యవస్థపై ఎటువంటి చెడు ప్రభావం చూపదు.


వర్షాకాలంలో చల్లని సాయంత్రం స్నాక్స్ తింటూ టీ సిప్ చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ తాగేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలని విషయం గుర్తు పెట్టుకోవాలి. టీతో కలిపి కొన్ని రకాల పదార్థాలు తీసుకోకూడదు. అలాగే టీ తయారీ పద్ధతులు కూడా శరీరంలో అనేక లోపాలకు దారి తీస్తుంది.


ఇనుము లోపం


టీలో కెఫీన్, టానిన్ నిండి ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టానిన్లు కొన్ని ఆహారాలతో కలిసి ఇనుము శోషణని తగ్గిస్తాయి. అందువల్ల టీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ప్రపంచంలోని అత్యంత సాధారణ పోషక లోపాలలో ఇదీ ఒకటి.  మీరు శాఖాహారులైతే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే టీ టానిన్లు జంతు ఆధారిత ఆహారాల కంటే మొక్కల ఆధారిత ఆహారాల్లో ఇనుమును ఎక్కువగా గ్రహించి శోషణకి ఆటంకం కలిగిస్తాయి.  


నిద్రకి ఆటంకం


టీ కెఫీన్ తో నిండి ఉండటం వల్ల దీన్ని అతిగా తాగితే నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. నిద్రకి సహకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫలితంగా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి, మానసిక సమస్యలతో ముడి పది ఉంటుంది. దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు.


గుండెల్లో మంట


కెఫీన్ గుండెల్లో మంటకి కారణమవుతుంది. యాసిడ్ రీఫ్లక్స్ లక్షణాలని తీవ్రతరం చేస్తుంది. కెఫీన్ అన్నవాహికకి ఇబ్బంది కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. మంటకి కారణమయ్యే ఆమ్లాలు అన్నవాహికలో సులభంగా చేరిపోతాయి.


దీర్ఘకాలిక తలనొప్పి


రోజులో ఎక్కువ సార్లు టి తాగే వారికి తీవ్రమైన, దీర్ఘకాలిక తలనొప్పి వస్తుంది. ఎక్కువ మోతాదులో కెఫీన్ శరీరంలో చేరడం వల్ల ఇది సంభవిస్తుంది. సోడా లేదా కాఫీ వంటి ఇతర కెఫీన్ పానీయాల కంటే టీలో కెఫీన్ తక్కువగా ఉన్నప్పటికీ రోజుకి 60mg కంటే కెఫీన్ తీసుకోకూడదు. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది.


తల తిరగడం


ఏదైన ఇతర సమస్యల కారణంగా మైకం తో బాధపడుతుంటే టీ తాగితే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. దీని వల్ల తల తిరగడం అధికమవుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రీబయోటిక్ ఆహారాలు ఇవే