మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అత్యంత ప్రమాదకరమైన కాలేయ వ్యాధులలో ఒకటి. ఈ కాలేయ వ్యాధి ప్రపంచ జనాభాలోని 46 శాతం మందిని ప్రభావితం చేస్తుందని అంచనా. ఇన్సులిన్ నిరోధకత, హైపర్ టెన్షన్, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక ట్రైగ్లిజరైడ్స్ కారణంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది ఏ వయస్సులోనై వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మధ్య వయస్సులో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది.


కాలేయంలో అధిక కొవ్వు చేరడం వల్ల ఈ వ్యాధి బారినపడతారు. అయితే ఈ వ్యాధిని గుర్తించేందుకు ప్రారంభం లక్షణాలేవి ఉండవు. కాబట్టి, గుర్తించడం కష్టం. ఫలితంగా మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ (MASH)కి పురోగమిస్తుంది. ఇది కాలేయ మచ్చలు, సిర్రోసిస్‌కు దారితీస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి.. కాలేయ వైఫల్యానికి, లివర్ సిర్రోసిస్ కు దారి తీస్తుంది. 


ప్రస్తుతం, ఈ రకమైన కాలేయ వ్యాధికి చికిత్స చేయడానికి మందులేవీ లేవని వైద్యులు చెబుతున్నారు. MASLDని నివారించడంలో లేదా రివర్స్ చేయడంలో శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడటానికి సులభతరం చేసే ఆహారాలను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను నివారిస్తాయి. సోడా వినియోగం కాలేయంలో ఇన్సులిన్ నిరోధకత, వాపును ప్రేరేపించడం ద్వారా MASLD ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైట్ సోడాలు తరచుగా జీరో షుగర్, జీరో క్యాలరీలని చెబుతున్నా.. నిపుణులు మాత్రం అవి ఆరోగ్యకరం కావని హెచ్చరిస్తున్నారు. 


డైట్ సోడా అంత ప్రమాదకరమా?


సోడాలు కార్బోనేటేడ్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు.. ఆరోగ్యానికి హానికరమని రుజువయ్యాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం ,ఆందోళన, టైప్ 2 మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ప్రమాదాలను పెంచుతాయని వెల్లడైంది. ఇటీవల జీరోషుగర్, జీరో క్యాలరీ పానీయాలకు ప్రజలు అలవాటు పడుతున్నారు. వీటిని తరచుగా తీసుకున్నట్లయితే ఈ వ్యాధులబారిన పడటం గ్యారెంటీ అని వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన కొత్త మార్గదర్శకం ప్రకారం శరీరంలోని కొవ్వును తగ్గించడానికి నాన్ షుగర్ స్వీటెనర్ లను ఉపయోగించకూడదని సూచించింది. అంతేకాదు వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొన్ని పరిశోధనలు డైట్ సోడాలు కౌమారదశలో శరీర కొవ్వు, రక్తపోటును పెంచేస్తాయని పేర్కొన్నాయి. అధిక డైట్ సోడా వినియోగం వాస్కులర్ ఈవెంట్స్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించాయి.


డైట్ సోడా కాలేయ సమస్యలను కలిగిస్తుందా?


డైట్ సోడా వల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇది సిర్రోసిస్ కు దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు. లివర్ సిర్రోసిస్ కారణంగా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి వాటి వినియోగానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. సోడా, ఇతర కార్బోనేటేడ్ పానీయాలు తీవ్రమైన కాలేయ సమస్యలకు కారణమవుతున్నాయి.


Also Read : పాలపొడితో పిల్లలకు నచ్చేలా ఇలా బర్ఫీ చేయండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.