Kishan Reddy about Pawan Kalyan: హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం తెలిసిందే. బీజేపీ 111 స్థానాల్లో బరిలోకి దిగగా, పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ 8 చోట్ల పోటీ చేసింది. బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు గెలుపొందగా, మరోవైపు మిత్రపక్షం జనసేన అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. అయితే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్న నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదేనని.. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే బీజేపీ, జనసేనతో కలిసి బరిలో దిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీతెలంగాణ ఎన్నికల్లో జనసేన ఎందుకు పోటీ చేసిందని కొందరు ఎలక్షన్ కంటే ముందు నుంచే ప్రశ్నించారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేని పవన్ పార్టీతో కలిసి బీజేపీ ఎందుకు పనిచేస్తుందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశానన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ, జనసేన శ్రేణులు ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.