పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు, లెజెండ్‌ క్రిస్టియానో రొనాల్డో.. మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రొఫెష‌న‌ల్ ఫుట్‌బాల్‌లో 1200వ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా నూతన చరిత్ర సృష్టించాడు. ఆల్ న‌స్రీ క్లబ్ త‌ర‌ఫున ఆడుతున్న రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో ఈ ఘనత సాధించాడు. అల్ రియాద్‌తో జరిగిన మ్యాచ్‌తో 1200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా అత్యధిక ఫుట్‌బాల్‌ ప్రొఫెష‌న‌ల్ మ్యాచ్‌లు ఆడిన రెండో ఆట‌గాడిగా క్రిస్టియానో రొనాల్డో రికార్డు నెల‌కొల్పాడు. ఇంగ్లండ్ ఆట‌గాడు పీట‌ర్ షిల్టన్ 1,390 మ్యాచ్‌ల‌తో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు. 1200వ మ్యాచ్ ఆడేందుకు స‌హ‌క‌రించిన జ‌ట్టు స‌భ్యుల‌కు ధ‌న్యవాదాలని ఈ ప్రయాణం నిజంగా గొప్పదని రొనాల్డో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.



 ఇటీవలే ఫుట్‌బాల్‌ చరిత్రలో రొనాల్డో మరో అరుదైన చరిత్ర సృష్టించారు. 200 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.  గత ఏడాది  కెరీర్‌ చివరి దశలో ఉన్న 37 ఏళ్ల రొనాల్డో సౌదీ అరేబియా కు చెందిన అల్ నజర్ క్లబ్‌తో ఏడాదికి 200 మిలియన్‌ యూరోలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌తో సౌదీ క్లబ్‌.. రొనాల్డోకు భారత కరెన్సీలో దాదాపు రూ.4400కోట్లు ప్రతీ ఏడాది చెల్లించనుంది. దీంతో ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యధిక ధర కలిగిన ఆటగాడిగా రొనాల్డో సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు.మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో రొనాల్డో డీల్ రద్దు చేసుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్‌ 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. పోర్చుగల్‌ సీనియర్‌ జాతీయ జట్టుకు 2003లో ఎంపికైన రొనాల్డో అదే ఏడాది క్లబ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు నాలుగేళ్లపాటు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌కు ఆడాడు. ఆ తర్వాత రియల్‌ మాడ్రిడ్‌, జువెంటస్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 14 ఏళ్ల తర్వాత 2021లో తిరిగి మాంచెస్టర్‌ క్లబ్‌కు వచ్చినప్పటికీ.. ఏడాదికే ఆ బంధం తెగిపోయింది.



 క్రిస్టియానో రొనాల్డో రాక ముందు అల్‌-నాసర్‌ జట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య కేవలం 8.6 లక్షలు మాత్రమే. కనీసం మిలియన్‌ కూడా లేదు. కానీ, డీల్‌ జరిగిన నాటి నుంచి దాని ఇన్‌స్టాగ్రామ్‌కు ఫాలోవర్ల సునామీ మొదలైంది. ఆ సంఖ్య మిలియన్లలో పెరుగుతోంది. డీల్‌ జరిగిన 48 గంటల్లో దాదాపు 30 లక్షలకు చేరగా.. 72 గంటల్లో అది 78 లక్షలకు ఎగబాకింది. హాప్పర్ హెచ్‌క్యూ ప్రకారం, ఈ పోర్చుగల్ ఆటగాడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో 600 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు $3.23 మిలియన్లు చార్జ్ చేస్తున్నాడు. ఆయన తరువాత స్థానంలో లియోనెల్ మెస్సీ ఉన్నాడు. $2.6 మిలియన్లు సంపాదిస్తూ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. జార్జినా- రొనాల్డో జంటకు నలుగురు పిల్లలున్నారు. మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు, కవలలను పుట్టే అవకాశం ఉందని గత అక్టోబర్‌లో ఈ జంట పేర్కొంది. ఈ ఫుట్‌బాల్‌ దిగ్గజం ఎంత బిజీగా ఉన్నప్పటకీ ఏ మాత్రం సమయం దొరికినా తన కుటుంబానికి కేటాయిస్తాడు. తన కుటుంబమే తనకు బలమని ఎప్పటికీ చెబుతుంటాడు. 



 ఆహార నియమాల విషయంలో రొనాల్డో కఠినంగా ఉంటాడు. ప్రతిరోజు ఆరుసార్లు స్వల్పంగా ఆహారం తీసుకుంటాడు. వీటిల్లో పండ్లు,కూరగాయలు, చికెన్‌ లేదా ఫిష్‌ ఉండేలా జాగ్రత్త పడతాడు. మంచినీటిని ఎక్కువగానే తాగుతాడు. కార్డియో, వెయిట్‌ ట్రైనింగ్‌, ఫుట్‌బాల్‌ డ్రిల్స్‌ వంటివి వారంలో ఐదు రోజులపాటు సాధన చేస్తాడు. ఒక్కో ట్రైనింగ్‌ సెషన్‌ కనీసం మూడు గంటలు ఉంటుంది. నిత్యం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటాడు.