Anantapur Crime News: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేశాడు. విడపనకల్లు మండలం పాల్తూరు ఎంపీపీ పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్న ప్రభుత్వ టీచర్ తన ఆత్మహత్యకు సీఎం జగనే కారణమంటూ సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. సీపీఎస్ రద్దు, ఐదవ తేదీ కల్లా జీతాలు ఇవ్వడమే తన చివరి కోరిక అని ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన లేఖలో టీచర్ రాసుకున్నాడు. జగన్ మాట తప్పడు, మడమ తిప్పుడు అని నమ్మి.. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అభిమానులతో కూడా వైసీపీకే తాను ఓట్లు వేయించానని.. కానీ ఆశించినట్లుగా జరగలేదు, హామీలు నెరవేర్చలేదని ఆవేదనతో టీచర్ ఈ చర్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది.


అసలేం జరిగిందంటే.. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అభిమానించినదుకు తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నానని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పాల్తూరు గ్రామం ఇందిరానగర్ లోని స్కూల్లో టీచర్ గా మల్లేశప్ప పని చేస్తున్నాడు. మల్లేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విరాభిమాని. 2019 ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడని నమ్మి ఉద్యోగులంతా ఓట్లు వేశారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ మాటిచ్చాడంటే అవి కచ్చితంగా నెరవేరుస్తాడని తోటి ఉద్యోగులతో తరచూ గొడవ పడేవాడు. 


సహచర ఉద్యోగులు కూడా సిపిఎస్ రద్దు, డీఏలు, జీతాలు కూడా సరిగా ఇవ్వలేడు అని మాట్లాడుతున్నప్పటికీ జగన్ మాటిచ్చాడంటే కచ్చితంగా దాన్ని అమలు చేస్తాడని పిచ్చి అభిమానంతో తోటి ఉద్యోగులతోనే వాదించే వాడినని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.  ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని మనోవేదనతో టీచర్ మల్లేశ్ ఉరవకొండ మండలం పెన్నా అహోబిలం దగ్గర విషపు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అటుగా వెళుతున్న కొందరు మల్లేశం చూసి ఆసుపత్రికి తరలించారు మల్లేష్ ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. 


మల్లేశప్ప సూసైడ్ నోట్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వడం. ఉద్యోగులకు రావలసిన పీఆర్సీ, డీఏలు చెల్లించడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు. వీటన్నిటిని ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ నెరవేరుస్తాడని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు వేశారని లేఖలో పేర్కన్నాడు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాల పూర్తి కావస్తున్న కూడా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని మల్లేశ్ మనోవేదనకు గురయ్యాడు. తన సూసైడ్ తో అయినా ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను తెలియజేయాలని ముఖ్యమంత్రికి తన సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు.


సూసైడ్ నోట్లో ప్రధానంగా నెరవేర్చాల్సిన తన ఆఖరి కోరికలను కూడా మల్లేశప్ప ప్రస్తావించాడు. ఉద్యోగులకు ఐదో తేదీలోపు జీతం చెల్లించాలని సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇవ్వాలని.. పెండింగ్లో ఉన్న పీఆర్సీలు, డీఏలు తక్షణమే మంజూరు చేయాలని ఇవే తన ఆఖరి కోరికలని ముఖ్యమంత్రికి లేఖ రాసి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఆత్మహత్యాయత్నం చేశాడు.