చెవుల్లో గులిమి తీసుకోవడానికి అందరూ ఉపయోగించేవి ఇయర్ బడ్స్. కొంతమంది అయితే చీర పిన్నులు, హెయిర్ పిన్నులు, పేపర్ క్లిప్స్, టూత్ పిక్ లు, పెన్నులు, చేతి వేళ్ళు పెడుతూ ఉంటాఋ. వాటితో శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అది ఎంత మాత్రం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. అదే కాదు ఇయర్ బడ్స్ కూడా వాడటం కరెక్ట్ కాదని, అది పూర్తిగా తప్పు అలవాటని తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల చెవులు వినికిడి శక్తి శాశ్వతంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.


చెవిలోని గుబిలి తీసుకోవడం అవసరమా?


ప్రతి ఒక్కరూ చెవిలోని గులిమి తీసుకోవాల్సిన అవసరం లేదు. అది పెద్ద మొత్తంలో పేరుకుపోయినప్పుడే చెవి నొప్పి, అంటు వ్యాధుల ప్రమాదం వస్తుంది. తాత్కాలిక వినికిడి లోపం, డిప్రెషన్ కి గురయ్యే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో చెవిలోని గులిమి తీసుకోవాల్సిన పని ఉండదు. ఎందుకంటే దానంతట అదే చెవిని శుభ్రం చేసుకోగలుగుతుంది. నిజానికి గులిమి అనేది చెవిలో సహజ గ్రంథుల నుంచి ఏర్పడే ఒక ద్రావణం. దానికి చర్మ మృతకణాలు, దుమ్ము అంటుకుంటాయి. దాని బయటకి పంపించే పని చెవి సొంతంగా చూసుకుంటుంది. అందుకు చెవి నిర్మాణం ఒక కారణం అయితే దవడ కదలికలు మరో కారణం. వీటి వల్ల దానంత అదే గులిమి బయటకి వచ్చేలా చేస్తుంది. తప్పని పరిస్థితుల్లో మాత్రమే శుభ్రం చెయ్యాలి.


చెవిలో గులిమి ఎలా తియ్యాలి?


ఒకవేళ చెవిలో గులిమి రాలిపోకపోతే దాన్ని తీసేయడానికి కొన్ని నివారణ చిట్కాలు ఉన్నాయి. వాటితో సురక్షితంగా గులిమి బయటకి తీసుకోవచ్చు. చెవులు చాలా సున్నితమైనవి వాటిని శుభ్రం చేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తే ప్రమాదం ఉంది.


⦿ 3-5 రోజులు రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు చెవిలో రెండు లేదా మూడు చుక్కల బాదం నూనె వెయ్యాలి.


⦿ చెవి గుండా లోపలికి వెళ్ళి అది పని చేసేందుకు వీలుగా కొన్ని నిమిషాల పాటు తలని ఒక వైపుకి వాల్చి పెట్టుకోవాలి.


⦿ రాత్రి వేళ నిద్రకి ఉపక్రమించే ముందు ఈ పని చేయడం ఉత్తమం.


⦿ అలా చేయడం వల్ల దాదాపు రెండు వారాల్లో చెవి నుంచి గులిమి బయటకి వచ్చేస్తుంది.


⦿ చెవిలోని గులిమి క్లీన్ చేయించుకోవడం కోసం కొంతమంది డాక్టర్లని సంప్రదిస్తారు. అది చాలా ఖరీదుతో కూడుకున్నది. అందుకే వైద్యుడి దాకా వెళ్ళకుండా ఇలా చేస్తే ఉపశమనం పొందవచ్చు.


ఈ తప్పులు చెయ్యొద్దు


చెవులు శుభ్రం చేసుకునేటప్పుడు కొన్ని పద్ధతులు అసలు పాటించకూడదు. అలా చేస్తే చెవులు దెబ్బతింటాయి. హెయిర్ పిన్నులు, టూత్ పిక్ వంటివి శుభ్రం చేసేందుకు ఉపయోగించకూడదు. అలాగే చెవి వ్యాక్యూమ్ లు కూడా వినిగయోగించక పోవడం మేలు. దీని వల్ల చెవులు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?