అన్ని సీజన్లలో అందరికీ అందుబాటులో ఉండే పండు అరటిపండు. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ అందించే సూపర్ ఫుడ్ ఇది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తి స్థాయులను పెంచుతుంది. అరటిపండులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, చక్కెర, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పేగు కదలికలని నియంత్రిస్తుంది. ఎన్నో పోషక గుణాలు కలిగిన అరటి పండు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో అతిగా తింటే మాత్రం అంతే అనారోగ్యాన్ని ఇస్తుంది.
అరటిపండులో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. రోజు రెండు అరటిపండ్లకి మించి తింటే బరువు వేగంగా పెరుగుతారు. అంతే కాదు ఇందులో లభించే పొటాషియం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన దానికి మించి పొటాషియం తీసుకుంటే మైకం, వాంతులు, పల్స్ రేటు పెరగుతుంది. ఇది హైపర్ కలేమియా లక్షణం. ఒక్కోసారి గుండె పోటుకు కూడా కారణమవుతుంది.
అతిగా అరటిపండు తింటే వచ్చే నష్టాలు
☀ అరటిపండ్లు అతిగా తినడం వల్ల దంతాల్లో పుచ్చు ఏర్పడుతుందని పరిశోధనలో తేలింది. ఇందులో స్టార్చ్ ఉంటుంది. ఇది దంతల మధ్య సులభంగా అంటుకుంటుంది. అందుకే అరటిపండు తిన్న రెండు గంటల్లోపు దంతాలు శుభ్రం చేసుకోవాలి.
☀ ఇందులో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే నరాలు దెబ్బతింటాయి. బాడీ బిల్డింగ్ కోసం అరటిపండ్లు ఎక్కువగా తినే వారికి ఈ సమస్య రావచ్చు.
☀ పచ్చి అరటిపండ్లలో స్టార్చ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. రోజూ తీసుకుంటే గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. పండిన అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి మంచిది. తక్కువ నీటిని కలిగి ఉంటాయి. అతిగా తింటే మాత్రం మలబద్ధకాన్ని తీసుకొస్తుంది.
☀ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే మధుమేహం ఉన్న వాళ్ళు వీటిని వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
☀ కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే పొటాషియం అధికంగా ఆహారాన్ని తీసుకోవద్దని సలహా ఇస్తారు. అటువంటి వాళ్ళు అరటిపండుని దూరం పెట్టాలి.
అరటిపండు వల్ల లాభాలు
రోజూ అరటిపండు తింటే మంచిదే. పెద్దది కాకుండా మీడియం సైజుది తీసుకోవాలి. గుండెపై ఒత్తిడి పడకుండా చేస్తుంది. ఒక వ్యక్తికి రోజుకు అవసరమైన పొటాషియాన్ని అరటిపండు తీర్చేస్తుంది. ఇందులో లెక్టిన్ ఉంటుంది. క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. అయితే పరగడుపున అరటిపండు తీసుకోరాదు. అలా అని పాలు అరటి పండు కూడా కలిపి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. చాలా మంది బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఒక అరటిపండు తినేసి కడుపు నింపుకుంటారు. కానీ దాని వల్ల పొట్ట ఉబ్బరం సమస్య వస్తుంది. అందుకే పరగడుపున ఎప్పుడు అరటిపండు తీసుకోవద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: కొవ్వు కరగాలా? వెల్లులిని ఇలా తీసుకోండి