Fire Accident: సికింద్రాబాద్ లోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. టీచర్స్ కాలనీ లోహియా నగర్ ఖాళీ గోదాములో చెత్తకు మంటలు అంటుకొని ఉవ్వెత్తున అగ్నికీలాలు ఎగిసాయి. ఎండిపోయి ఉన్న చెత్త, చెట్లతో మంటలు మరింతగా ఎగసిపడ్డాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. అయితే మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ నేతాజీ కూడా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

  


ఏపీలోని వంశధార పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం - కోట్లలో ఆస్తి నష్టం


ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిల్లాలోని నరసన్నపేట మండల కేంద్రంలోని వంశధార పేపర్ మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే... గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో స్థానిక పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోపే చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెల్ల కాగితాల పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం నెలకొందని స్థానిక పరిశ్రమ సిబ్బంది తెలిపారు. ఆస్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని పరిశ్రమ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. 


ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు మంటలు పక్కనున్న ఇళ్లకు అంటుకోకుండా... బకెట్లలో నీళ్లు తెచ్చి పోశారని పోలీసులు వివరించారు. దీని వల్లే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని వివరించారు. అంతే కాకుండా ఈ షెడ్ కు ఆనుకొని పార్క్ చేసి ఉన్న ఆటో డ్రైవర్లకు సమాచారం ఇచ్చి.. ఆటోలను అక్కడి నుంచి తరలించేలా చేశారు. దీని వల్ల ఆటోలు అగ్నికి ఆహుతి కాకుండా ఉన్నాయి. పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు మంటలు అంటుకొని ఉంటే నష్టం భారీ స్థాయిలో ఉండేదని వివరించారు. ఎట్టకేలకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లతో పూర్తి స్థాయిలో మంటలను ఆర్పీ వేశారు.


పదిహేను రోజుల క్రితమే హైదరాబాద్ లో..


హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చిక్కడపల్లి వి.ఎస్.టి సమీపంలోనీ ఓ గోదాంలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా దట్టమైన పొగలతో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. టెంట్ హౌస్ హోల్ సేల్ సప్లై చేసే గోదాంలో ప్రమాదం సంభవించడంతో దాదాపు అన్ని కాలిపోయినట్లు తెలుస్తోంది. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్ని మాపక యంత్రాలతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు సాయం చేయడంతో పాటు ప్రమాదం ఎలా జరిగింది, ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, ఆస్తి నష్టం ఎంత మేర ఉంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.