మీ పిల్లల వయసు 12 ఏళ్లు దాటిందా, వారికి 18 ఏళ్ల వయసు దాటేవరకు వారు టీనేజర్లే. ఆ తరువాత వారు పెద్దవారి కోవలో కలుస్తారు. ఈ 12 -18 ఏళ్ల మధ్య ఉన్న టీనేజీ పిల్లలు ప్రవర్తన మారుతూ ఉంటుంది. దీని వల్ల వారిని ప్రత్యేకంగా చూస్తారు తల్లిదండ్రులు. వారి విషయంలో ఎన్నో అపోహలు ప్రజల్లో ఉన్నాయి. కానీ తల్లిదండ్రులుగా వారిని మీరు నమ్మకూడదు. వారిని ప్రత్యేకంగా చూడకూడదు. వారిని ఎప్పటిలా మీ పిల్లలుగానే చూడాలి. వారి చేసే పనులను భూతద్దం పెట్టి చూడడం, వారిలో తప్పులు వెతకడం మానేయాలి. వారిని స్వేచ్ఛగా ఎదగనవ్వాలి. టీనేజీ వయసుకు సంబంధించి నమ్మకూడని అపోహలు ఇవే.
టీనేజీ ఒక దశ
టీనేజీ వయసు పిల్లలకు కాస్త గందరగోళానికి గురిచేస్తుంది.ఈ దశలో ఇలాగే ఉంటారు, అని వాళ్లని పట్టించుకోవడం మానేయకండి. ఎక్కువ మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇదే. వాళ్లు ఏం మాట్లాడినా, ఏం చేసినా టీనేజీ వయసు కదా అన్న అపోహలో పడి తేలికగా తీసుకుంటారు. తల్లిదండ్రులుగా వారు చెప్పేది వినండి, వారికి అండగా ఉండండి. వారి సందేహాలకు జవాబులు ఇవ్వండి. గందరగోళ ఆలోచనల మధ్య వారిని వదిలేయకండి. వారికి ఈ దశలో భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. వాటికి విలువివ్వండి. వారికి చికాకు అనిపించే విషయాలు మాట్లాడకండి.
ఆ వయసు చెడ్డది
టీనేజీ వయసును చాలా తక్కువగా చూస్తారు చాలా మంది తల్లిదండ్రులు. ఆ వయసులో ఉన్న వారు మాట వినరని, పనులు చేయరని, సోమరితనంతో ఉంటారని, పెద్దలకు మర్యాద ఇవ్వరని అనుకుంటారు. అది కేవలం అపోహే. నిజానికి టీనేజర్లు చాలా స్వీయ దృష్టిని కలిగి ఉంటారు. వారు ప్రతిరోజూ పోరాడవలసిన ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వారు అల్లరిగా, అమర్యాదగా ఉండాలని కోరుకోరు. వారిలో వస్తున్న మార్పులు కొన్ని సార్లు మనలి అలాంటి అభిప్రాయాలు కలిగేలా చేస్తాయి.
వారు గొడవలు పడతారు
టీనేజీ పిల్లలు ప్రతి దానికి గొడవలు పడతారని, విసిగిపోతారని అనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. కోపం వస్తే అందుకు తగిన విధంగా ప్రవర్తించడం ప్రతి వయసులో జరిగేది. అంతెందుకు చిన్నపిల్లలు కూడా తిరగబడి కొట్టే సందర్భాలు ఉంటాయి. కేవలం టీనేజీ పిల్లలే అలా చేస్తారనుకోవడం తప్పు. కాకపోతే పిల్లలుగా ఉన్న వారు హఠాత్తుగా తల్లిదండ్రులను ప్రశ్నించడం అనేది టీనేజీ వయసుకు వచ్చాకే జరుగుతుంది. అందుకే వారు గొడవలు పడే వారిగా అనుకుంటారు తల్లిదండ్రులు.
బాధ్యతారాహిత్యంగా
టీనేజీ పిల్లలకు బాధ్యతగా ఉండరు, వారికి బాధ్యతారాహిత్యం ఎక్కువ అని నమ్ముతారు తల్లిదండ్రులు. కానీ ఇది పూర్తిగా తప్పు. వారికి కొత్త విషయాలపై చాలా ఆసక్తి కలుగుతుంది. కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నంలో, వారు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. ఆ సమయంలో వారిని తిట్టడం కంటే మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రుల చేతుల్లో ఉంది.
తల్లిదండ్రులు నచ్చరు
టీనేజి వయసుల పిల్లలు తన స్నేహితులతో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. దీంతో తమను పట్టించుకోడని, తామంటే ఇష్టం లేదని అనుకుంటారు తల్లిదండ్రులు. నిజానికి ఆ వయసులోనే ఇతర బంధాలు కూడా ఎంత ముఖ్యమో వారికి అర్థమయ్యేవి. ముఖ్యంగా స్నేహం. వారిని ఈ విషయంలో తిట్టేకన్నా భోజనం సమయంలో వారితో కలిసి తినడం చేయండి. వారితో కలిసి అప్పుడప్పుడు బోర్డ్ గేమ్‌లు ఆడండి. ముఖ్యంగా వారిని స్వతంత్రంగా ఎదగనివ్వండి.
తల్లిదండ్రులుగా మీరు ఏమి చేయాలి?
పిల్లలుగా ఉన్నప్పుడు మీ పక్కనే నిద్రపోయేవారు, టీనేజీ వయసుకు రాగానే ఒంటరిగా పడుకునేందుకు ఇష్టపడతారు. ఆ నిర్ణయాన్ని గౌరవించండి. ప్రైవసీని కోరుకుంటారు వాళ్లు. ఆ నిర్ణయాన్ని విమర్శించకండి. వారికంటూ ఒక బెడ్రూమ్ కావాలని కోరుకుంటారు. వీలైతే వారికి ఇవ్వండి. వారిని స్వతంత్రంగా ఎదగనివ్వండి. వారిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వండి. మనసులోని భావాలను పంచుకోనివ్వండి.
Also read: ‘బౌద్ధ డైట్’ను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం, ఇప్పుడిదే కొత్త ట్రెండ్