మూత్రం రంగు మారినా, దుర్వాసన వస్తున్నా ఎక్కువ మంది పట్టించుకోరు. పైగా ఆ సమస్యను వైద్యులకు చెప్పేందుకు సిగ్గుపడి కొంతమంది ఆసుపత్రికి వెళ్లరు. అవే ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తాయి. మన శరీరం ప్రతి అనారోగ్య సమస్యను ఏదో ఒక లక్షణం ద్వారా తెలియజేస్తుంది. అలా మూత్రం దుర్వాసన వేయడం కూడా ఒక సంకేతమే. మూత్రం దుర్వాసన వేయడం వారం రోజులకు మించి ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. కొన్ని రకాల వ్యాధులు దీనికి కారణం కావచ్చు.
మధుమేహం
ప్రపంచంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.కాబట్టి నాకెందుకు వస్తుందిలే అనుకోకండి. మీ ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. డయాబెటిస్ అదుపులో లేకపోతే మూత్రం దుర్వాసన వస్తుంది. అలాగే అది తీపిగా మారుతుంది. దీనివల్ల మూత్రం పోశాక, దాని చుట్టూ చీమలు చేరుతాయి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)ఒక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దీని వల్ల కూడా మూత్రం దుర్వాసనకు దారితీయవచ్చు. ఆ వాసన గాఢమైన అమ్మోనియాలాగా ఉంటుంది. ఆ బ్యాక్టిరియా మూత్రవ్యవస్థలో చేరడం వల్ల వస్తుంది.
ప్రోస్టాటిటిస్
ఇది మగవారికి మాత్రమే వచ్చే సమస్య. ఇది ప్రొస్టేట్ గ్రంథికి వచ్చే రుగ్మత. అక్కడ వాపు కూడా వస్తుంది. ఈ సమస్య వల్ల కూడా మూత్రం కుళ్లిన గుడ్డులా దుర్వాసన వస్తుంది. అంతేకాదు మూత్రం పోసేటప్పుడు నొప్పి కూడా వస్తుంది.
కాలేయ వ్యాధులు
కాలేయ సమస్యలు ఉన్నవారిలో కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్రంలో విషపదార్థాలు, వ్యర్థాలు చేరిపోతాయి. కాలేయం వాటిని విచ్ఛిన్నం చేయలేదు. మూత్రం ముదురురంగులో వస్తుంది. అందులో బిలిరుబిన్ పేరుకుపోవడం వల్ల గోధుమ, కాషాయం, నారింజ రంగులో ఉంటుంది.
మీ మూత్రం దుర్వాసన రావడానికి పైన చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి కారణం అవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే వైద్యులను సంప్రదించాలి. ఇవన్నీ కూడా చికిత్స తీసుకోవాల్సిన సమస్యలే. లేకుంటే ప్రాణాంతకంగా మారుతాయి.
Also read: ఉప్పు డబ్బాతో ముప్పే - కాస్త చప్పగా ఉన్నా ఫర్వాలేదు తినేయండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.