బట్టతల ఒకప్పుడు మగవాళ్ళకి మాత్రమే వస్తుందని అనుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బట్టతల సమస్య ఎదుర్కొంటున్నారు. పైగా వయసుతో సంబంధం లేకుండా వచ్చేస్తోంది. దీన్ని కవర్ చేసుకోవడానికి ఏదో ఒక స్టైల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కలబంద సహజ నివారణి. జుట్టు, చర్మానికి మాత్రమే కాదు మొత్తం ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనితో బట్టతల సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. 


కలబందతో జుట్టు పెంచుకోండి


అలోవెరాలో విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొత్తం జుట్టు ఆరోగ్యానికి దోహదపడతాయి. మాయిశ్చరైజింగ్ లక్షణాలు స్కాల్ఫ్ ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తాయి. కలబంద తలకి పట్టించడం వల్ల చుండ్రు సమస్య, దురద తగ్గిపోతుంది. మాడు మీద ఉండే చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది. జుట్టు నల్లగా, మెరిసేలా చేస్తుంది. మాడుపై దెబ్బతిన్న కణాలని నయం చేసే గుణాలు అలోవెరాలో ఉన్నాయి.


స్కాల్ఫ్ హెల్త్: కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చికాకుని తగ్గించి స్కాల్ఫ్ ని శాంతపరుస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడంలో ఆరోగ్యకరమైన మాడు అవసరం. అది కలబందతో పొందవచ్చు.


మాయిశ్చరైజింగ్: ఇందులో వాటర్ కంటెంట్, నేచురల్ మాయిశ్చరైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి స్కాల్ఫ్ ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.


పోషకాలు ఇస్తుంది: అలోవెరాలో విటమిన్లు ఏ, సి, ఇ, మినరల్స్ ఉన్నాయి. జుట్టు ఆరోగ్యానికి ఇవి దోహదపడతాయి. ఇందులోని ఎంజైమాటిక్ కంటెంట్ తల మీద మృత కణాలు రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. హెయిర్ ఫోలికల్ దెబ్బతినకుండా చూస్తుంది.


Also Read: దిగులుగా, డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుందా? అయితే ఆహారపు అలవాట్లు మార్చేసుకోండి


బట్టతల రివర్స్ చేస్తుందా?


జుట్టు ఆరోగ్యానికి కలబంద అనేక ప్రయోజనాలు అందిస్తుంది. కానీ ఇది బట్టతలని తగ్గిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరిన్ని పరిశోధనలు అవసరం. ఇది వెంట్రుకలు, ఫోలికల్స్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కానీ జుట్టు రాలడాన్ని పూర్తిగా తిప్పికొట్టే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మినాక్సిడిల్, ఫినాస్టరైడ్ వంటి వైద్య చికిత్సలతో వెంట్రుకలు తిరిగి పెరిగేలా చేసుకోవచ్చు. ఈ చికిత్సలు జుట్టు రాలడానికి కారణమైన డీహెచ్టీ(డైహైడ్రోటెస్టోస్టిరాన్) లక్ష్యంగా చేసుకుని పని చేస్తాయి. ఈ హార్మోన్ బట్టతలకి కారణమవుతుంది.


Also Read: అందంగా ఉంటే కెరీర్లో దూసుకెళ్లడం ఖాయం అని చెబుతున్న కొత్త అధ్యయనం


జుట్టు కోసం కలబంద ఎలా ఉపయోగించాలి?


⦿మొక్క నుంచి సేకరించిన స్వచ్చమైన కలబంద గుజ్జుని తలకి అప్లై చేసుకోవచ్చు. రసాయనాలు లేదా మంచి స్మెల్ ఉత్పత్తులు తలకి రాసుకోవడం నివారించాలి.


⦿ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. కలబంద తలకి అప్లై చేసే ముందు ఈ టెస్ట్ చేసుకుంటే మంచిది. అలర్జీ లేదా మరేదైనా సమస్యలు లేకపోతే నిర్భయంగా తలకి పట్టించుకోవచ్చు.


⦿కలబంద జెల్ నేరుగా తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. కనీసం 30 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.


⦿హెయిర్ కేర్ రొటీన్ లో భాగంగా వారానికి రెండు సార్లు తలకి కలబంద గుజ్జు పట్టిస్తే బాగుంటుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.