క్యారెట్లు వండుకునే కన్నా పచ్చిగా తింటేనే ఎంతో రుచి. పచ్చి క్యారెట్లను తినడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. రోజుకో క్యారెట్ తింటే మంచిదని వైద్యులు కూడా చెబుతారు. అయితే క్యారెట్ అధికంగా తినడం వల్ల శరీరం రంగు మారిపోతుందనే వాదన ఉంది. అతిగా క్యారెట్లు తింటే చర్మం పసుపు, ఆరెంజ్ కలిసి రంగులోకి మారిపోతుందని అంటారు. ఇది ఎంతవరకు నిజం?


బీటా కెరాటిన్ వల్లే...
క్యారెట్లలో బీటాకెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లు ఆరెంజ్ రంగులో ఉండడానికి కూడా బీటా కెరాటిన్ కారణం. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ సమ్మేళనం. సహజమైన కలర్ పిగ్మెంట్. బీటా కెరాటిన్ మనం తిన్న తరువాత శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఈ విటమిన్ మనకు చాలా అవసరం. క్యారెట్లు మితంగా తినడం వల్ల సరిపడినంత విటమిన్ ఎ తయారవుతుంది. కానీ అధికంగా తినడం వల్ల కొంత బీటాకెరాటిన్ విటమిన్ ఎ గా మారి, మిగతాది రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల చర్మం రంగు మారడం మొదలవుతుంది. చర్మం కాస్త సాధారణ రంగులో కాకుండా పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ ఆరోగ్య పరిస్థితిని కెరోటినేమియా అంటారు. ఇది చర్మానికి మంచి చేయదు. ఈ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థాయికి రావాలంటే కొన్నాళ్లు క్యారెట్లను పూర్తిగా తినడం మానివేయమని సలహా ఇస్తారు వైద్యులు. ఇంకా అధికంగా బీటాకెరాటిన్ రక్తంలో చేరితే మరిన్ని దుష్ఫ్రభావాలు కలిగే అవకాశం ఉంది. 


ఎన్ని తినాలి?
రోజుకు ఒక మీడియం సైజు క్యారెట్ తింటే చాలు. అంతకుమించి అవసరం ఉండదు. మిగతా ఆహారం ద్వారా కూడా విటమిన్ ఎ శరీరంలో చేరుతుంది కాబట్టి, ఒక క్యారెట్ తింటే సరిపోతుంది. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజుకో క్యారెట్ తినేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు, అంధత్వం అంత త్వరగా దాడి చేయవు. కాలేయ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వాటి నుంచి రక్షణ పొందవచ్చు.  
ఖాళీ పొట్టతో క్యారెట్ తింటే అధిక ప్రయోజనాలు కలుగుతాయి. 


క్యారెట్ శరీరంలో కొవ్వు పట్టకుండా కాపాడుతుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియ కూడా సక్రమంగా జరిగేలా చూస్తుంది.  జుట్టు ఎదుగుదలకు కూడా ఇది సహకరిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇవ్వడంలో కూడా క్యారెట్లోని పోషకాలు ముందుంటాయి. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా తినాల్సిన ఆహారం క్యారెట్. 


Also read: ఇంట్లో పనీర్ సరిగా తయారుచేయలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే బయట కొనే పనీర్‌లాగే ఉంటుంది



Also read: మామిడి తొక్కలు పడేస్తాం కానీ, వాటిల్లోనే పోషకాలన్నీ


Also read: వ్యాపిస్తున్న BA.4 వేరియంట్, ఈ రెండు లక్షణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే