మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. వేసవిలో ఈ పండ్లదే హవా.  వీటిని తినేప్పుడు మనం తొక్కను తీసి కేవలం లోపలి గుజ్జునే తింటాం. కానీ ఈ పండ్లను తొక్కతో పాటూ తినాలని చెబుతారు పెద్దలు. అంతెందుకు ఆవకాయలు పెట్టేటప్పుడు తొక్కను తీయరు. తొక్కను బాగా కడిగి శుభ్రం చేసి వాటితోనే ఆవకాయలు పెడతారు. ఇప్పటికీ ఇదే పద్దతి కొనసాగుతోంది. ఆవకాయల రూపంలో మామిడి తొక్కను తినడానికి అభ్యంతరం లేనప్పుడు, పండుగా తినేందుకు ఎందుకు ఇబ్బంది? మామిడి తొక్కను తినడం మన శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోవడం ఖాయం. 


రుచి బాగోవు...
కరక్కాయ రుచి బాగోదు, చేదుగా ఉంటుంది అయినా తింటున్నాం కదా. కాకరకాయ రుచి కూడా చాలా చేదుగా ఉంటుంది అయినా ఆరోగ్యం కోసం తింటున్నాం కదా, అలాగే మామిడి తొక్కల రుచి వగరుగా ఉంటుంది. అయినా తింటే చాలా మంచిది. రుచి బాగోదని తినడం మానేయకూడదు. ఈ తొక్కలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంటి చూపుకు, మెదడు పనితీరుకు, చర్మానికి ఇది చాలా అత్యవసరం. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా విటమిన్ ఎ  ముఖ్య పాత్ర పోషిస్తుంది. మామిడి తొక్కలు తినేవారిలో కొన్ని రకాల రోగాలు త్వరగా రావు. తొక్కల్లో కూడా ఎన్నో ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. 


మహిళలకు...
మహిళలు ముఖ్యంగా మామిడి పండును తొక్కతో పాటూ తినాలి. ఎందుకంటే ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తహీనత సమస్య పోతుంది. రక్త ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు బరువు తగ్గాలనుకునే వారికి కూడా మామిడి తొక్కలు మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా చక్కగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం కూడా రాదు. 


ఆ వ్యాధులు దూరం
మామిడి పండ్ల తొక్కతో సహా తినడం వల్ల గుండె జబ్బులు, హైబీపీ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. 


గర్భిణులకు..
గర్భిణులు మామిడి పండ్లను తినడం వల్ల చాలా మేలు. గర్భంతో ఉన్న బిడ్డకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు అన్నీ ఇందులో ఉంటాయి. అయితే తొక్కతో పాటూ తినాలనుకునే వారు కచ్చితంగా పండును నీటిలో కనీసం పది నిమిషాల పాటూ నానబెట్టి,బాగా కడిగి అప్పుడు తినాలి. కొన్ని సార్లు పండ్లను మగ్గబెట్టేటప్పుడు రసాయనాలు వాడే అవకాశం ఉంది. 


Also read: వ్యాపిస్తున్న BA.4 వేరియంట్, ఈ రెండు లక్షణాలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే


Also read: పుతిన్‌కు సోకిన క్యాన్సర్ ఇదే, ఈ వ్యాధి వచ్చాక ఎన్నాళ్లు బతుకుతారో తెలుసా?